Jayaprakash Narayana Supports NDA in Andhra Pradesh: అమరావతి: లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ (Jayaprakash Narayana) ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు తెలిపారు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ (JP). ఈ కూటమికి ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమికి జయప్రకాష్ నారాయణ మద్దతు తెలపడంపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. లోక్‌సత్తా అధినేత జేపీ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.


జయప్రకాష్ నారాయణ నిర్ణయంపై చంద్రబాబు హర్షం.. 
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జయప్రకాష్ నారాయణ ఈ నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భావ సారుప్యత కలిగిన వ్యక్తులు, పార్టీలు, నేతలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి జేపీ మద్దతు తెలపడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. 






జేపీకి నారా లోకేష్ ధన్యవాదాలు.. 
జయప్రకాష్ నారాయణ వంటి గొప్ప మేధావి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన సహకరించడానికి సిద్ధమైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. #TDPJSPBJPWinning యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.


ఎన్డీఏ కూటమిపై జేపీ ఏమన్నారంటే.. 
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన కారణంగా రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని, అయినా ఏపీ అభివృద్ధి కోసం తప్పడం లేదన్నారు జేపీ. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని, పరిశ్రమల స్థాపన జరుగుతుందని జేపీ అభిప్రాయపడ్డారు. తాను నిజాయితీగా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.