Chandrababu : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ వైఖరిని వెల్లడించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్న చంద్రబాబు గురువారం కోస్తాంధ్ర ప్రాజెక్టుల గురించి వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 780 కోట్లు కేటాయించి.. రూ. ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. తన సొంత కేసుల్లో గెలుస్తున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టుల కేసుల్లో మాత్రం ఓడిపోతున్నారని ఎద్దేవా చేశారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోతే కనీసం రిపేర్లు చేయించలేదన్నారు.
వైసీపీ సర్కార్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది చాలా తక్కువ !
తెలుగుదేశం పార్టీ హయాంలో కోస్తాంధ్రలో ప్రాజెక్టుల కోసం రూ. 21, 442 కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ వైసీపీ హయాంలో కేవలం రూ. 4375 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. ఇది కూడా నిర్వహణ ఖర్చుల కోసమేనని.. నిర్మాణాలన్నీ పడకేశాయన్నారు. ప్రాజెక్టులను అలా వదిలేసి ప్రజాద్రోహం చేశారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ప్రాజెక్టుల్లో నాలుగు శాతం పనులే చేయడం సిగ్గు చేటన్నారు. కోస్తాంధ్ర ప్రరిధిలో 96 ప్రాజెక్టుల పనులు టీడీపీ హయాంలో ప్రారంభిస్తే వైసీపీ వచ్చాక వాటన్నింటినీ ప్రి క్లోజర్ చేశారన్నారు. పోలవరం కుడి కాలువ మట్టిని దోచుకున్నారన్నారు. ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు.ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తైతే.. నీటి సమస్యే ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులు.. వీటి కింద అనేక నదులు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. వంశధార - గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చు.. కానీ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
నదుల అనుసంధానం ముఖ్యం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పడకేశాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకుండా, కమీషన్ల కక్కుర్తితో టెండర్లు పిలిచించి.. తనకు కావలసిన కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయలు చెల్లించారని ఆరోపించారు. ప్రీ క్లోజర్ చేస్తూ, అయిదేళ్లపాటు టెండర్లే పిలవకూడదంటూ జీవో జారీ చేశారన్నారు. ప్రెస్ మీట్ పెడుతున్నానని.. ప్రాజెక్టులపై సీఎస్ హడావుడి సమీక్ష పెట్టారని తెలిపారు. సీఎం జగన్, మంత్రి లేకుండానే ప్రాజెక్టులపై సమీక్షించారన్నారు. ‘‘ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కానీ.. అంబోతులా అరుస్తాడు తప్ప ఏం చేయడు..?. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టినట్టే ఉంది. ఈ ఏడాది చివర్లో ఏదో ఐదు ప్రాజెక్టులు ప్రారంభిస్తారట. ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు..?’’ అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణ కూడా చేయలని చెత్త ప్రభుత్వమన్నారు.
జగన్ కిమ్ బ్రదర్ !
జగన్ రెడ్డి పేదలకు పెత్తందార్లుకు పోరాటం అంటూ స్లోగనర్లు ఇస్తున్నారని... ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే పేదలకు మేలు జరిగేది కదా అని ప్రశ్నించారు. స్లోగన్లు వద్దని సలహా ఇచ్చారు. ఓ పక్క దోచుకుంటూ.. మరో పక్క స్లోగన్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేసి కూడా అనవసరమన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల నిర్మాణంపై టైమ్ బాండ్ ప్రొగ్రాం పెట్టుకుని పని చేస్తామని ప్రకటించారు. జగన్ రెడ్డి కిమ్ బ్రదర్ అని.. ప్రజల్ని నవ్వినా కొడతారు.. ఏడ్చినా కొడతారని సెటైర్ వేశారు. ఇంత కన్నా చెత్తగవర్నమెంట్ ఎక్కడా లేదన్నారు. బటన్ నొక్కితే అమ్మఒడి వెళ్తోందా అని ప్రశ్నించారు. రూ. పదహేను వేలన్నారు..త త్రవాత రూ. 13 వేలు ఇస్తున్నామంటూ బటన్ నొక్కి.. రూ. 5 వేలు వేస్తారా..? అని ప్రశ్నించారు. జగన్ను నొక్కేది ఉత్తుత్తి బటనే. అసలు బటన్ సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్సులో నొక్కుతాడని మండిపడ్డారు.