AP CM Chandrababu :   ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్రలోని ప్రతి ఎకరంకు నీరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లిలో చంద్రబాబు మాట్లాడారు. అనకాపల్లికి తాగు, సాగు నీరిస్తే తన జన్మ ధన్యమవుతుందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం తాము ఎంతో  కృషి చేసిన గత ప్రభుత్వం నిర్వాకం వల్ల మొత్తం నాశనం అయిపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ హయాంలోనే 72 శాతం పూర్తి చేశామని కానీ  ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గోదవరిలో కలిపేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని స్థితికి తీసుకు వచ్చారన్నారు.                      


అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వ పనులను చంద్రబాబు పరిశీలించారు.  ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వెంటనే ప్రారంభించడానికి టెండర్లు పిలుస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం రూ.800 కోట్లు ఖర్చు చేస్తామని తె.. సుజల స్రవంతితో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి అన్న సంకల్పంతోనే పని చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.  ప్రభుత్వం చేసే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో.. ప్రజలంతా గమనించాలన్నారు. ప్రజల శ్రేయస్సే.. తమ అభిమతమని అన్నారు.                                                                                                                           


గోదావరి జిల్లాల తర్వాత కూటమికి ఉత్తరాంధ్రలోనే అత్యధిక మెజార్టీ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు.  రాక్షస పాలనను అంతమొందించేందుకు కూటమిని   ఓటర్లు గెలిపించారన్నారు.  ఎన్నికలు అయ్యాయని ఇళ్లకే పరిమితం కావొద్దని ప్రజల్ని కోరారు.  అబద్ధాలు చెప్పిన వైసీపీ నేతల్ని తిరగకుండా చేయాలని పిలుపునిచ్చారు. కూటమి గెలుపుతో.. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉందన్నారు. మొన్నటి వరకూ రాష్ట్రంలో కిమ్ పాలన జరిగిందని, కూటమి హయాంలో.. ప్రజలందరికీ సంతోషంగా జీవించే అవకాశం వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు. 


ఉత్తారంధ్ర సుజల స్రవంతి పథకానికి గతంలో టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినా తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఫలితంగా ప్రాజెక్టు పడకేసింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు మరోసారి సీఎం కావడంతోఆ ప్రాజెక్టుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.