Unstoppable Babu : చంద్రబాబునాయుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ?. స్కూల్లో.. కాలేజీలో..రాజకీయాల్లో ..పార్టీల్లో చంద్రబాబుతో చాలా మంది కలిసి ప్రయాణించారు. అయితే వారందరికెల్లా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే.. తడుముకోకుండా చంద్రబాబు చెప్పిన పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 14వ తేదీన స్ట్రీమింగ్ కానున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొలి ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రోమోలో ఇతర విషయాలతో పాటు రాజకీయ పరమైన అంశాలపై కూడా బాలకృష్ణ ప్రశ్నలు వేశారు. అవి ఆషామాషీవి కాదు. అయినా చంద్రబాబు ఓపెన్ అయ్యారు. అన్నీ చెప్పేశారు. అలా టీజర్‌లో స్పష్టంగా ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరపున ఒకే సారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో వారి మధ్య మంచిస్నేహం ఉంది. ఆ స్నేహం తర్వాత చంద్రబాబు పార్టీ మారిన తర్వాత కూడా కొనసాగింది. ఈ విషయాన్ని చంద్రబాబు ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణకు వివరించారు. అయితే ప్రోమోలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే వైఎస్ అని చెప్పే వరకే ఉంది. ఆ ఫ్రెండ్ షిప్‌లో తీపి గుర్తులు.. జ్ఞాపకాలు... మధ్యలో రాజకీయాలు .. తమ ఫ్రెండ్ షిప్‌ను విచ్చిన్నం చేశాయా లేకపోతే.. ఆ మిత్రుత్వం చివరి వరకూ సాగిందా అన్నది ఫుల్ ఎపిసోడ్‌లో చూడొచ్చు.
అదే సమయంలో చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తీసుకున్న బిగ్ డెసిషన్ ఏమిటన్న ప్రశ్న కూడా బాలకృష్ణ వేశారు . దీనికి కూడా చంద్రబాబు తడుము కోకుండా చెప్పారు ..95లో మనం తీసుకున్న నిర్ణయమే అని. 95లో తెలుగుదేశం పార్టీ లో సంక్షోభం ఏర్పడింది. లక్ష్మి పార్వితి కారణంగా పార్టీ పూర్తి స్థాయిలో భ్రష్టుపట్టిపోతోదని పార్టీ నేతలంతా తిరుగుబాటు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ ... ఒకే మాట మీద ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లినా మద్దతు లభించలేదు. టీడీపీలో జరిగిన ఆ ఎపిసోడ్‌కు ప్రజల మద్దతు లభించిందని టీడీపీ వర్గాలు చెబుతూంటాయి. తర్వాత మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఘటనను ఇప్పటికి ఇతర పార్టీలు రాజకీయ విమర్శలకూ ఉపయోగించుకుంటూ ఉంటాయి.
అప్పట్లో అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటన్నది చంద్రబాబు ఇప్పటి వరకూ ఎప్పుడ ఓపెన్‌గా చెప్పలేదు. తొలి సారి అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బతిమాలామని ఆయన చెబుతున్నారు. అయితే ఇది టీజర్ మాత్రమే. ఇంటర్యూలో మొత్తం అప్పటి ఎపిసోడ్ గురించి ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా తనపై ఎన్నో విమర్శలు రావడానికి కారణం అయిన 95 ఘటనలపై చంద్రబాబు పూర్తి స్థాయిలో తన మనసులో మాటలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఈ ఎపిసోడ్‌లోనే హైలెట్ అయ్యే అవకాశం ఉంది. 14వ తేదీన ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.