TDP And Janasena: ఎన్నికల తరుణంలో మహిళలను ఆకట్టుకునేందుకు టీడీపీ అనేక పథకాల పేరుతో హామీలు ఇస్తోంది. గతంలో ప్రకటించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టోలో భాగంగా మహాశక్తి పథకం పేరుతో మహిళలకు టీడీపీ పలు కీలక హామీలు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతీ నెలా రూ.1500 ఆర్ధిక సాయం వంటి ప్రధాన హామీలు ప్రకటించి వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే ఇవాళ మహిళా దినోత్సవం సందర్బంగా మరో కీలక హామీని టీడీపీ ప్రకటించింది.


విద్యార్థినుల కోసం 'కలలకు రెక్కలు' స్కీమ్


మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలలకు రెక్కలు అనే స్కీమ్‌ను టీడీపీ ప్రకటించింది. దీనికి సంబంధించి పోస్టర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తన ట్విట్టర్‌లో విడుదల చేశారు. 'ఇకపై మన ఆడబిడ్డలు ఆర్థిక పరిస్థితి సహకరించక ఇంటికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ యువతుల కలలకు టీడీపీ, జనసేన రెక్కలు ఇవ్వనుంది. విద్యార్థినులు తీసుకునే రుణానికి ఇకపై మేము గ్యారెంటీ.  యువతులు కోర్సు చదవిన కాలానికి అయ్యే ఖర్చుకు పూర్తి వడ్డీ మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేస్తున్న ఆడబిడ్డలు పై చదువులు చదువుకునేందుకు తీసుకునే రణాలకు మా ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


ఎలా అప్లై చేసుకోవాలంటే...?


https://kalalakurekkalu.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పథకం కోసం యువతులు దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. త్వరలో ఏర్పడే టీడీపీ, జనసేన ప్రభుత్వంలో మహిళలకు అభివృద్ది, స్వేచ్చ, భద్రత కల్పిస్తామని అన్నారు.  మహిళా సాధికారిత అంటే ఓట్ల రాజకీయం కాదని, ఆడబిడ్డలు బాగుండేలా చూడటం అని వ్యాఖ్యానించారు. ఆర్ధిక పరిస్తితులు అనుకూలించని కారణంగా ఆడబిడ్డులు చదువులకు దూరంగా కాకూడదనే ఉద్దేశంతో కలలకు రెక్కలు పథకాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే దీనికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు సమాజంలో సగం జనాభా మాత్రమే కాదని, సమాజ శక్తిలో సగం అని అన్నారు.


మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ టీడీపీ


ఈ సందర్భంగా మహిళల అత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు గుర్తు చేశారు.  మహిళలను తమ పార్టీ తోబుట్టువుల్లా చూసిందని, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు నింపిందని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా ప్రత్తికొండలో జరిగిన సభలో ఈ పథకంకు సంబంధించి చంద్రబాబుకు భార్య భువనేశ్వరి ప్రకటన చేశారు. అనంతరం సాయంత్రం ఈ పథకం వివరాలను చంద్రబాబు ట్విట్టర్‌లో వివరించారు. ఏపీలో మహిళా ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. దీంతో వారి ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.