Chandrababu Support Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమి తరపున తెలుగువ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎన్నికల్లో నిలపడంతో..తెలుగు పార్టీలు అన్నీ మద్దతివ్వాలని రేవంత్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్‌లకు ఆయన ఈ పిలుపునిచ్చారు. గతంలో పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీ చేస్తే అన్ని పార్టీలు సహకిరంచాయన్నారు. అయితే రేవంత్ రెడ్డి తెలుగు సెంటిమెంట్ ప్రస్తావనకు పెద్దగా స్పందన రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి .. బీజేపీ అభ్యర్థికే మద్దదతు ప్రకటించారు. వైసీపీ ఎంపీలు రాధాకృష్ణన్‌కే ఓటేస్తారు. కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటేసి లేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా స్పందించారు. 

ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబను అక్కడి మీడియా ఈ అంశంపై స్పందించాలని కోరింది. తెలుగు వ్యక్తి పోటీలో ఉన్నారు సమర్థిస్తారా అని ప్రశ్నించింది. చంద్రబాబు అసలు విపక్ష పార్టీలు ఇలా ఎలా ఆశిస్తాయని ప్రశ్నించారు. తాము ఒక కూటమిలో ఉన్నామని గుర్తు చేశారు.   మేము మరొక అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఎలా  అనుకుంటారని ప్రశ్నింతారు.  తెలుగుదేశం పార్టీ తెలుగు సమాజం కోసమే ఉందని.. అయితే  అది వేరే విషయమన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున  తాము కూటమికి కట్టుబడి ఉంటామన్నారు.  మా పార్టీకి నీతి, విశ్వసనీయత ఉన్నాయి. ఐదు దశాబ్దాల కాలంలో మేము ఈ విశ్వసనీయతను నిర్మించుకున్నామమని గుర్తు చేశారు. తన వైఖరి మీకు మొదటి నుంచీ తెలుసని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. 

అలాగే అభ్యర్థి గుణగుణాలపైనా స్పందించారు.  అభ్యర్థిత్వం పరంగా ఎవరైనా పోల్చినట్లయితే సిపి రాధాకృష్ణన్ అందరూ మద్దతు ఇవ్వవలసిన ఉత్తమ అభ్యర్థి అని తేల్చేశారు. మెజారిటీ ఉంటే  అది చాలా గౌరవప్రదమైన పదవి.  విపక్షాలు  ఇప్పుడు మరొక అభ్యర్థిని ఎందుకు తీసుకువచ్చారు? అది అవసరమా?  అని ప్రశ్నించారు.  అది వారి రాజకీయం. కానీ మనం ఇక్కడ రాజకీయాలు  చేయడం లేదని.. ఎన్డీఏకు మెజార్టీ ఉందని.. ఈజీగా గెలవబోతున్నామని తెలిపారు.  

అంతకు ముందు   చంద్రబాబు నాయుడు, టిడిపి ఎంపీలతో కలిసి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను కలిశారు. తమ పూర్తి మద్దతును ప్రకటించారు. దేశంలో గౌరవించ దగ్గ వ్యక్తి, అత్యున్నత స్థానానికి మంచి అభ్యర్థి, దేశానికి గౌరవం తీసుకొస్తారని ప్రశంసించారు. సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కుర్చీకి ప్రతిష్ట పెంచుతారని.. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయని ఆయనతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నారు.