TDP Meetings: ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయనే వార్తల క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) దూకుడు పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. బాదుడే బాదుడు, భవిష్యత్తుకు గ్యారెంటీ లాంటి కార్యక్రమాలతో మొన్నటివరకు ప్రజల్లోనే ఉన్న చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కొద్దిరోజుల పాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు.. గత కొద్ది రోజులుగా 'రా.. కదలి.. రా' పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా షెడ్యూల్‌ను టీడీపీ (TDP) విడుదల చేసింది. అందులో భాగంగా ఈ నెల 27 నుంచి వరుసగా మూడు రోజుల పాటు 'రా.. కదలి.. రా' బహిరంగ సభలు చంద్రబాబు నిర్వహించనున్నారు.
ఆరు నియోజకవర్గాల్లో సభలు
ఈ నెల 27, 28, 29వ తేదీల్లో ఆరు నియోజకవర్గాల్లో సభలు జరపనున్నారు. 27వ తేదీన పీలేరు, ఉరవకొండలో, 28వ తేదీన నెల్లూరు రూరల్, పత్తికొండలో, 29వ తేదీన రాజమండ్రి రూరల్, పొన్నూరులో బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనేలా టీడీపీ ప్లాన్ చేసింది. అటు ఇప్పటికే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనస్తాపంతో చనిపోయినవారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒకవైపు భువనేశ్వరి పర్యటిస్తుండగా.. మరోవైపు చంద్రబాబు బహిరంగ సభలతో టీడీపీకి మైలేజ్ తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. బాబు పర్యటనలతో ఎన్నికలకు ముందు టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. బహిరంగ సభల ద్వారా జగన్ ప్రభుత్వంలోని లోపాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటి ద్వారా శ్రేణులను ఎన్నికలకు చంద్రబాబు సిద్దం చేస్తున్నారు.
ఈ నెల 5వ తేదీ నుంచి చంద్రబాబు రా.. కదలి రా బహిరంగ సభలు మొదలుపెట్టారు. 5న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరిగింది. ఈ నెల 29వ తేదీ వరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా టీడీపీ టార్గెట్ పెట్టుకుంది. రోజుకు రెండు చోట్ల చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సభలు సక్సెస్ అయ్యేలా పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రతి సభకు లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా జనసమీకరణ చేస్తున్నారు. ఈ సభల్లో జనసేన నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. త్వరలో రా.. కదలి రా బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశముంది.
ఇప్పటివరకు ఒంగోలు, విజయవాడ, తిరుపతి, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు, అరకు, రాజంపేట, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటించారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు సభలు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఏప్రిల్ 16 నుంచి లోక్‌సభ ఎన్నికలు విడతల వారీగా జరుగుతాయని ప్రచారం సాగుతోంది. అంటే ఇక రెండు నెలలు మాత్రమే ఎన్నికలకు టైమ్ ఉండటంతో పార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తుండగా.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది.