At Home : నేడు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమంలో సతీసమేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు హాజరయ్యారు. ఈ తేనేటి విందు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ మంత్రులను గవర్నర్ కు పరిచయం చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
రాజ్ భవన్ ఎట్ హోం అంటే..
ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు రాష్ట్ర గవర్నర్ ఇచ్చే విందు కార్యక్రమాన్ని రాజ్‌భవన్ 'ఎట్ హోమ్' అంటారు. అందరూ ఒకేసారి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయితే రాజ్ భవన్ లో జాతీయ గీతాలాపనతో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు.. ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఆత్మీయంగా పలకరించారు. అలాగే, రాజ్ భవన్ లోని ఎట్ హోం కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్, వైఎస్ షర్మిళ పరస్పరం అభివాదం చేసుకున్నారు.
సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నారా లోకేష్
రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. గవర్నర్, ఛీఫ్ జస్టిస్, సీఎస్ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఈ ప్రోగ్రాంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన్ను కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు నేతలు, అధికారులు పోటీ పడ్డారు. అలాగే వైఎస్ షర్మిల కనిపించగానే లోకేష్ ఆమెను పలకరించారు. ఆమె కూడా కాసేపు మంత్రి లోకేష్ తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన సతీమణి విదేశాల్లో ఉండటంతో ఒంటరిగానే కార్యక్రమానికి హాజరయ్యారు.
జగన్ గైర్హాజరు
గతం ఐదేళ్లు సీఎంగా ఉండగా ప్రతీ ఏటా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాలకు హాజరైన వైఎస్ జగన్ .. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎట్ హోం కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. తన సోదరి వైఎస్ షర్మిల కూడా హాజరై సీఎం, మంత్రులతో కలివిడిగా కనిపించిన ఈ కార్యక్రమంలో జగన్ లేకపోవడంతో అంతా తన గురించే చర్చించుకుంటున్నారు. అటు జగన్ గైర్హాజరుపై వైసీపీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ మినహా మిగిలిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. పీసీసీ ఛీఫ్ షర్మిల ఈ కార్యక్రమానికి రావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే షర్మిల , మంత్రి లోకేష్ లు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకోవటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు నిమిషాల పాటు చర్చించుకోవటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.