Chandrababu Naidu on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొని 2019 నాటికి తాము 70 శాతం పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు వెనక్కి వెళ్లాయని అన్నారు. రాజకీయాల్లోకే అనర్హుడైన వ్యక్తి రాష్ట్రానికే శాపంగా మారాడని వైఎస్ జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. అందుకు పోలవరం ప్రాజెక్టే నిదర్శనమని అన్నారు. డయాఫ్రం వాల్‌ను నాశనం చేశారని అన్నారు. 


చంద్రబాబు సోమవారం (జూన్ 17) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. తొలుత వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతిని చంద్రబాబు పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు స్పిల్ వే దగ్గరికి వెళ్లారు. స్పిల్ వే 26వ గేట్ వద్ద పనుల వివరాలను తెలుసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.


‘‘వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే రివర్స్ టెండరింగ్ చేశారు. ఈఎన్సీని మార్చేస్తామని చెప్పారు. అప్పటిదాకా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సహా ఉన్న మిగతా సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. 2019 - 20 లో భారీగా వరదలు వచ్చాయి. ఆ దెబ్బకు డయాఫ్రం వాల్ బాగా డ్యామేజ్ అయింది. మొత్తం 456 కోట్లతో డయాఫ్రం వాల్‌ను రెండు సీజన్లలో పూర్తి చేశాం. దాన్ని ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు భవిష్యత్తుతో ఆడుకొంది. కేంద్రం చాలా సార్లు వైసీపీ తీరును తప్పుబట్టింది. 


నేను 100 సార్లు పోలవరం ప్రాజెక్టుపై రివ్యూ చేశాను. 30 సార్లు ప్రాజెక్టును సందర్శించాను. డయాఫ్రం వాల్‌ కు బాగు చేయడానికి 447 కోట్లు అవుతుంది. అది నిర్మించడం కోసం ఖర్చు పెట్టినది రూ.456 కోట్లు. రిపేర్ల కోసం రూ.447 కోట్లు పెట్టినా అది పూర్తిగా బాగుపడుతుందనే గ్యారంటీ లేదు. మొత్తం డయాఫ్రంవాల్ ఇప్పుడున్నదానికి సమాంతరంగా కట్టాలంటే రూ.900 కోట్లు ఖర్చు అవుతుంది. 


కాఫర్ డ్యామ్‌ ల విషయంలో మొత్తం ఇసుక 20 నుంచి 30 మీటర్ల లోతున మొత్తం కొట్టుకుపోయింది. రెండు కాఫర్ డ్యామ్ ల మధ్య ఇసుకతో నింపడానికి ఇంకో రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు. టీడీపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేది. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై నేను నిపుణులతో మాట్లాడగా.. మరో 4 సీజన్ల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే మరో నాలుగేళ్లు సమయం పడుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.