Telangana Crime News: ప్రేమ వ్యవహారం నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రేమ పేరుతో జరిగిన దుర్ఘటలు కుటుంబాలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఓ ఘటనలో ప్రేమ వ్యవహారం నచ్చలేదని ఓ ఫ్యామిలీపై దాడి చేసిందో కుటుంబం. మరో ఘటనలో పెద్దల విడదీస్తారన్న భయంతో ఆత్మహత్యకు యత్నించిందో జంట. రెండు ఘటనల్లో కూడా పోలీసులు జోక్యం చేసుకొని కేసు నమోదు చేశారు.  


వరంగల్‌లోని కీర్తినగర్ కాలనీకి చెందిన అద్వాన్ అలీ అదే కాలనీ చెందిన యువతితో కొన్ని సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు అయితే యువతి తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం ఇష్టం లేదు. ఇరు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో పంచాయితీ నడుస్తోంది. 


చివరకు ఈ మధ్య ఎంబీఏ పూర్తి చేసిన అద్వాన్‌ అలీ పని నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి వచ్చారు. అప్పటికే కీర్తి నగర్ కాలనీకి చేరుకున్న యువతి తండ్రి తన బంధువులు అద్వాన్ అలీ ఇంటిపై దాడి చేశారు. మారణాయుధాలతో అతన్ని, అతని తల్లిపై దాడికి పాల్పడ్డారు. ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచారు.  తీవ్ర గాయాలైన అద్వాన్  అలీ, సమీరాను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన ప్రవళికకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తలు విడిపోయారు. ఇంటివద్ద ఉంటున్న ప్రవళిక అదే గ్రామానికి చెందిన రవీందర్‌తో మరోసారి ప్రేమలో పడింది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెళ్లికి అడ్డు చెప్పారు. కుటుంబాలు అంగీకరించకోపవడంతో... రెండు నెలల క్రితం ప్రవళిక రవీందర్ పారిపోయి శ్రీకాకుళం జిల్లాలో జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కనిపించడం లేదని ప్రవళిక, రవీందర్ తల్లిదండ్రులు బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు వారం రోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లి ఇద్దరిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వీరి ప్రేమ వ్యవహారంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరగనుంది. పంచాయితీలో తీర్పు అనుకూలంగా వస్తుందో రాదోనని ఆందోళనకు గురైన ప్రవళిక, రవీందర్ ఒకే చోట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రవళిక మృతి చెందగా, రవీందర్ ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డాడు. 
ఆ ప్రయత్నం విఫలమవ్వడం ప్రవళిక చనిపోవడంతో రవీందర్ మళ్ళీ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని కూడా వరంగల్ ఎం.జి.ఎం  ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్‌లు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.