Chandrababu Naidu: ఉత్తరాంధ్రలో నిర్మితం అవుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించిన వివిధ నిర్మాణాల్ని గగనతలం నుంచి పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతి, భోగాపురం ఎయిర్ పోర్టు, రాయ్ పూర్ విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించారు.
తర్వాత విశాఖ- విశాఖ ఎకనామిక్ రీజియన్ పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. 9 జిల్లాల్లోని వీఈఆర్ పరిధిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, లక్ష్యాలు, పెట్టుబడుల ఆకర్షణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో మొత్తం 9 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ ఉన్నాయి. ప్రస్తుతం 1.65 కోట్ల జనాభా, 38,000 చదరపు కి.మీ విస్తీర్ణం, 52 బిలియన్ డాలర్ల జీడీపీ, 3,170 డాలర్ల తలసరి ఆదాయం, 70 లక్షల వర్క్ ఫోర్స్ ఉంది.
ప్రస్తుతం ఏపీలో 31 శాతం విస్తీర్ణం, 23 శాతం జనాభా, 30 శాతం జీడీపీ వీఈఆర్‌దే భాగస్వామ్యం. 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి... గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్ జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ హబ్, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ-హౌసింగ్, అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 6 పోర్టులు ఉన్నాయి. ప్రస్తుత ఆపరేషనల్ పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్ పోర్టు. కొత్తగా కాకినాడ గేట్ వే, మూలపేట పోర్టులు సిద్ధం అవుతున్నాయి. కొత్త 7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులు, 77 కి.మీ. మేర వైజాగ్ మెట్రో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే ఈ రీజియన్ లో 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, వరల్డ్ క్లాస్ నర్సరీ, ఫుడ్ పార్క్స్, ఆక్వాపార్క్, 5 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదనంగా 7.5 లక్షల ఇళ్లు, 10 వేల హోటల్ రూములు, 20 వరకు మెడికల్, ఐటీ, స్కిల్లింగ్ కాలేజీలు, 5,000 హాస్పటల్ బెడ్స్, పరిశ్రమలకు 50 వేల ఎకరాలు, 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులు వీఈఆర్ పరిధిలో అవసరమని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు పెట్టుబడులు ఆకర్షించి.. మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.