Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పోలీసులు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అధికారులు పేవర్ వర్క్ పనిని పూర్తి చేస్తున్నారు. అక్కడ చంద్రబాబును సుమారు గంటన్నర పాటు విచారించే అవకాశం ఉంది. చంద్రబాబు స్టేట్‌ మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్‌ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబును వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లనున్నారు. వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. 


ఇన్వెస్టిగేషన్ అధికారికి చంద్రబాబు లేఖ
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేసు ఇన్వెస్టిగేషన్ అధికారికి లేఖ రాశారు. తన తరఫు న్యాయవాదులను కలిసే హక్కు తనకు ఉందన్నారు. కేసుపై న్యాయపరమైన అంశాలు చర్చించడానికి నలుగురు న్యాయవాదులు అవసరం ఉందన్నారు. దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం. లక్ష్మీ నారాయణ, జవ్వాజి శరత్ చంద్రలను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.  


చంద్రబాబు లాయర్లను అనుమతించని పోలీసులు
అంతకు ముందు చంద్రబాబు తరఫున వచ్చిన నలుగురు అడ్వకేట్లను పోలీసులు సిట్ కార్యాలయంలోకి అనుమతించడం లేదు.  దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై చంద్రబాబు తరఫు అడ్వకేట్లు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నిటిలో నిబంధనలకు విరుద్ధం‌గా దర్యాప్తు అధికారులు ప్రవర్తిస్తున్నారని  ఆరోపించారు. 


న్యాయవాదులను ఏ నిబంధనల ప్రకారం, ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు టీడీపీ నేతలకు ఏపీ గవర్నర్ అపాయింట్‍మెంట్ కోరారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోందని, పోలీసు రాజ్యం తప్ప ప్రజాస్వామ్యం లేదన్నారు. రాత్రి 7.15కు గవర్నర్‍ను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. 


చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ నేతలు న్యాయపరంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీం సీనియర్ న్యాయవాది  సిద్ధార్థ లుధ్రా విజయవాడ వచ్చారు.  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న సిద్ధార్థ లూధ్రా అండ్ టీమ్ .. కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయింది.  చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు  సిద్ధార్థ లుధ్రా వినిపించే అవకాశం ఉంది.  చంద్రబాబు కేసులను సిద్దార్థ్   చూసుకుంటారు. అమరావతి కేసును కూడా సిద్దార్థ్ వాదించారు. మరోవైపు సీఐడీ, సిట్ తరపున వాదనలు వినిపించనున్నారు.


Also Read: చంద్రబాబు కోసం ప్రత్యేక విమానంలో సుప్రీంకోర్టు సీనియర్ లాయర్