Chandrababu On NDA :  ప్రధాని మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలను .. అభివృద్ధి విధానాలను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ విషయంలో తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు.  ప్రత్యేకహోదా సెంటిమెంట్ వల్లనే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఓ ఇంగ్లిష్ చానల్ నిర్వహించిన  సమ్మిట్‌లో ఆయన్ ఆన్ లైన్ ద్వారా మాట్లాడారు. ఈ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 


ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మోదీ ప్రత్యేకమైన గుర్తింపులు తీసుకు వచ్చారన్నారు. మోదీ ఆర్థిక విధానాలు బాగున్నాయని.. ప్రస్తుతం రూ. రెండు వేల నోట్ల రద్దును కూడా తాను ప్రతిపాదిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. టెక్నాలజీ రంగంలో భారత్ పురోగమిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ పొజిషన్‌లో ఉందని తెలిపారు. దేశంలో సాంకేతికతకు.. విజ్ఞానానికి ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు. 


జీఎస్టీ సంస్కరణ మరింత పారదర్శకత తీసుకు వచ్చిందన్నారు. ఐదు వందల కన్నా ఎక్కువ డినామినేషన్ ఉన్న నోట్ల రద్దును తాను సమర్థిస్తానని తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అద్భుతాలు చేస్తున్నారన్నారు. భారత్‌లో ఉన్న యువ జనాభాను  పక్కాగా ఉపయోగించుకోవాల్సి ఉందన్నారు. వచ్చే పాతికేళ్లలో భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదిగే అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ ఇండియాకు ఉన్న  ముఖ్యమైన పవర్ అన్నారు.  


2014లో ఎన్డీఏలో కలిసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో భాగస్వాములయ్యారు. ఏపీలో బీజేపీ .. కేంద్రంలో టీడీపీ ప్రభుత్వాల్లో భాగమయ్యారు.  నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నా.. ఏపీలో ప్రత్యేక హోదా సెంటిమెంట్ పెరగడం.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినా... దాన్ని సరిగ్గా విడుదల చేయలేదన్న భావనతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2019  ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు. తర్వాత  ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. నిజానికి అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టారు. అది విఫల ప్రయోగంగా మారింది. దాంతో ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఆలోచన చేయలేదు.                 


కానీ దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నించారు. చురుకుగా దేశవ్యాప్తంగా పర్యటించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం అనుకూలంగా రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో దూరం జరిగారు. జాతీయ రాజకీయాలను పట్టించుకోవడం మావేశారు. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు. మళ్లీ తాను జాతీయ రాజకీయాల వైపు చూసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇటీవల ఎన్డీఏకు.. ప్రధాని మోదీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.