Chandrababu made key comments in cabinet meeting on liquor scam : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇప్పటి వరకూ లిక్కర్ స్కాం దర్యాప్తులో పురోగతిపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేబినెట్ కు వివరాలు అందించారు. లిక్కర్ స్కాంపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షిపాతంగా దర్యాప్తు చేస్తున్నాయని ఈ అంశంపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.   లిక్కర్ స్కాం అంశం దర్యాప్తులో ఎవరూ ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది.  ఆ బృందంలోని సభ్యలు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో  రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా  చెప్పడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వారికి చాన్స్ ఇవ్వొద్దని చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది.  

వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇందు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. చాలా కాలం పాటు.. సోదాలు, ఆధారాల సేకరణ కోసం పని చేసిన సిట్ ఆ తర్వాత అరెస్టులు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో వరుసగా  మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు అయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. వీరు పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం డబ్బులు రూటింగ్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.                                 

ఏ వన్ గా రాజ్ కెసిరెడ్డి ఉన్నారు. మొత్తం ఈ స్కాంకు కర్త , కర్మ, క్రియ ఆయనేనని విజయసాయిరెడ్డి కూడా చెబుతున్నారు. ఈ కార్మంలో లిక్కర్ స్కాంలో  అంతిమ లబ్దిదారు ఎవరు అన్నదానిపై ఇప్పటికే సాక్ష్యాల సేకరణ పూర్తయిందని చెబుతున్నారు. సరైన సమయం చూసి..   అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. జగన్ టార్గెట్ గానే లిక్కర్ స్కాం కేసును నడుపుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  కానీ పోలీసులు తమ పని తాము చేసుకుపోతారని.. ఆధారాలను బట్టి చర్యలు తీసుకోకుండా ఉండరన్న సంకేతాలు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి.                                     

లిక్కర్ స్కాం విషయంలో ప్రభుత్వం రాజకీయ జోక్యం లేదా రాజకీయ విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అందుకే దర్యాప్తు విషయాలు కూడా బయటకు రాకుడా చూసుకుంటున్నారని అంటున్నారు. లిక్కర్ స్కాంలో ముడుపులు బంగారం రూపంలో పెద్ద ఎత్తున చెలామణిలోకి తెచ్చారన్న ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. లిక్కర్ కంపెనీ యాజమాన్యాలను కమిషన్ల కోసం.. తుపాకీ గురి పెట్టి బెదిరింపులకు దిగారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.  ఈ క్రమంలో  లిక్కర్ స్కాంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది.