Chandrababu News: అనకాపల్లిలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకు గురైన ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తో చంద్రబాబు మాట్లాడారు. పారిశుద్ధ్యం ఆహార నాణ్యత ఎలా ఉందో చూడాలని ఆదేశించారు. హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాల్లో వసతులను పరిశీలించాలని నిర్దేశించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేయాలని సీరియస్ అయ్యారు.
పరామర్శించిన హోం మంత్రి
కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ‘‘92 మంది పిల్లల ఉన్నారు 82 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. కేజీహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం పిల్లలకు అస్వస్థతకు గురైన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి, వాళ్ళని పంపించి వేశారు. అందరూ చాలా చిన్న పిల్లలు. ఈ ఘటన చాలా బాధాకరం. పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాని వల్ల ఇంతటి ఘోరం జరిగింది.
10 లక్షల ఎక్స్ గ్రేషియా
పాస్టర్ కిరణ్ పై కేసు నమోదు చేశాము. అరెస్టు చేశాము. ప్రభుత్వ పరంగా మృతి చెందిన పిల్లల కుటుంబానికి 10 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాం. బయట ఫంక్షన్ నుండి వచ్చిన ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. అసలు ఫుడ్ ఎవరు పంపారు. సమోసాలు ఎవరు తెచ్చారు అనే దానిపై విచారణ చేస్తున్నాం. మతపరమైన బోధనలు చేసి తల్లిదండ్రులను మోటివ్ చేసి ఇలాంటి చోట్లుకి తీసుకువస్తున్నారు. ఇలాంటి హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా క్లోజ్ చెయ్యాలి. ఇప్పటికే విశాఖ జిల్లాలో రెండు ఉన్నట్లు గుర్తించి, వాటిని క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం’’ అని వంగల పూడి అనిత మాట్లాడారు.