Divvela Madhuri responds on Duvvada Vani Allegations | టెక్కలి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ ఇంకా సద్దుమణగలేదు. ఆయన భార్య, జడ్పీటీసీ దువ్వాడ వాణి ఇంకా దువ్వాడ ఇంటి వద్దే నిరసన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కూతుళ్లకు మేలు జరగడం కోసమే పోరాటం చేస్తున్నానని ఆమె అంటున్నారు. దివ్వెల మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని భార్య వాణి సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఇళ్లు కావాలని, డబ్బులు ఏమీ అవసరం లేదని.. భర్త దువ్వాడతో కలిసి ఉండాలన్నదే తన నిర్ణయం అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎవరితో తిరిగినా తాను పట్టించుకోనని, ఇకే ఇంట్లో ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని ఆకాంక్షించారు. 


తన వల్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రాణాలకు ముప్పు ఉందన్న దువ్వాడ వాణి చేసిన ఆరోపలపై వైసీపీ మహిళా నేత దివ్వెల మాధురి ఘాటుగా స్పందించారు. తాను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను, బై అంటూ పోస్ట్ చేసిన మాధురి మళ్లీ యాక్టివ్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కు, వాణికి తన వల్ల ప్రాణహాని ఉందన్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. గత రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఆలనా పాలనా చూసుకుంటున్నది తానేనని చెప్పారు. ‘ఈ ఇంట్లో శ్రీనివాస్ తో మాధురి గత రెండేళ్లుగా ఉందని వాణి ఆరోపించారు. నా నుంచి వాళ్ల ప్రాణాలకు ముప్పు నిజం అయితే గత రెండేళ్లుగా దువ్వాడ ఆలనాపాలనా చూసుకున్నప్పుడు ఎందుకు ఏ చిన్నహాని జరగలేదు.


మనుషుల్ని తీసుకొచ్చి, బలవంతంగా ఇంటి డోర్లు పగలగొట్టి రచ్చ రచ్చ చేసింది ఎవరు. మాధురి ఇక్కడ ఉంటే ఒప్పుకోనని వాణి అంటున్నారు. ఇంట్లో ఉండవద్దని నా మీద కామెంట్స్ చేసినందుకు స్పందిస్తున్నాను. ఇంటి స్థలం ఓనర్ కు దువ్వాడ శ్రీనివాస్ రూ.60 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దువ్వాడ సోదరుడు కూడా సాయం చేశారని చెప్పారు. నేను కూడా దువ్వాడకు రూ.2 కోట్ల వరకు ఇచ్చాను. నాకు ఇవ్వాల్సిన రూ.2 కోట్లు దువ్వాడ వాణి ఇచ్చి ఆమె ఇంటిని తీసుకోవాలి. ఆ ఇల్లు ఖాళీ చేసి రూ.6 కోట్లతో శ్రీనివాస్ ఇల్లు కట్టించి, ఆ ఇంట్లో సకల భోగాలు కల్పించి ఆయన రోడ్డునపడ్డారు. ఆ ఇంటికి ఆమె వెళ్లిపోయి, లీగల్ ప్రొసిడింగ్స్ చేస్తే ఏ సమస్యా లేదు.


 



దువ్వాడ ఏ డబ్బులు తీసుకుని వాడుకునే వ్యక్తి కాదు. తనకు ఇవ్వాల్సిన రూ.2 కోట్లు ఉన్నప్పుడు ఇస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెక్కులు ఇచ్చారు. రూ.50 లక్షల చెక్కులు నాలుగు నాకు దువ్వాడ ఇచ్చారు. ఇప్పటివరకూ ఎప్పుడు ఆర్థిక పరమైన విషయాలు మాట్లాడలేదు. ఇంటి మీద హక్కు లేదని వాణి అన్నందుకు ఈరోజు చెక్కుల వ్యవహారం బయటకు తెచ్చా. ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించుకుంటే మంచిది. నాకు హక్కు ఉన్న ఇంట్లో నుంచి నన్ను బయటకు ఎలా పంపిస్తారు. నాకు రావాల్సిన అప్పు రూ.2 కోట్లు తిరిగి చెల్లిస్తే ఇంటిపై హక్కు వదులుకుంటానని’ దివ్వెల మాధురి స్పష్టం చేశారు.