AP Cabinet: ఢిల్లీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఇద్దరు నేతలు హాజరయ్యారు. రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబు కేబినెట్ కూర్పు పై కసరత్తు ప్రారంభించారు. తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న పలువురు ఆశావహులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. తమ అధినేతను కలిసి ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పవన్ కల్యాణ్...కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఇప్పుడు ఎవరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయో అన్న చర్చ మొదలైంది. ఇది ఇలా ఉంటే కూటమి ఎమ్మెల్యేలంతా మంగళవారం చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది.
ఎన్నికల్లో విజయఢంకా
ఇటీవల జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. 164 స్థానాలతో రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టని విధంగా రికార్డు విక్టరీ నమోదు చేసింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేనకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. తాను డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్ తో పాటు ఆ పార్టీలో మరికొందరిని కేబినెట్ లో తీసుకునే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సీట్ల కేటాయింపు విషయంలో కాంప్రమైజ్ అయిన జనసేనకు కేబినెట్ పదవుల్లో మాత్రం ప్రాధాన్యత దక్కుతుందని తెలుస్తోంది. కనీసం ఐదు మంత్రి పదవుల వరకు దక్కే ఉందని సమాచారం. ప్రభుత్వంలో ఉంటూనే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇదివరకే పవన్ కల్యాణ్ తెలిపారు.
26 మందితో చంద్రబాబు కేబినెట్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1A) ప్రకారం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతం కంటే ఎక్కువగా మంత్రి మండలి ఉండకూడదు. ముఖ్యమంత్రి సహా మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ కాకుండా.. మొత్తం సభ్యుల్లో 15 శాతం కంటే ఎక్కువ కాకుండా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 15 శాతం అంటే 26 మందితో కేబినెట్ ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈ 25 మందిలోనే టీడీపీ, జనసేనకు ఎక్కువ మొత్తంలో మంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీకి మాత్రం ఒక మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. కేంద్రంలో టీడీపీకి రెండు పదవులే ఇవ్వడంతో.. రాష్ట్రంలో బీజేపీ కి ఒక మంత్రి పదవి ఇచ్చి సరిపెడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మిగతా వాటిలో టీడీపీకి 20, జనసేనకు ఐదు కేబినెట్ బెర్తులు వస్తాయని ప్రచారం జరుగుతుంది. రేపు రాత్రికి గానీ ఏపీ మంత్రివర్గంపై ఓ స్పష్టత రానుంది.
ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ఉదయం 9.30గంటలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. మిత్రపక్షాల ఎమ్మెల్యేలంతా శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కూటమి తరపున గవర్నర్‌కు అందజేస్తారు. మరోవైపు, కేసరపల్లిలో జరగబోవు ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 12న ఉదయం 11:27 గంటలకు రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.