Viral Video: హన్మకొండ జిల్లాలో వింత ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి కొలనులోని నీటిలో తేలుతూ కనిపించాడు. అతడు కదలకుండా అలాగే ఉండడం అటుగా వెళ్తున్న వ్యక్తులు చూసి చనిపోయాడని భావించారు. ఈ విషయమై కేయూ పోలీసులకు, 108సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నీటిలో తేలుతున్న వ్యక్తిని పోలీసులు చేయి పట్టుకుని లాగారు. అలా పట్టుకోగానే అతను వెంటనే లేచి నిలబడడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
కొన్ని గంటలపాటు నీళ్లలో తేలుతూ..
ఈ ఘటన హన్మకొండ నగరంలోని రెండో డివిజన్ పరిధిలోని రెడ్డిపురం కోవెలకుంటలో జరిగింది. ఓ వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలో తేలుతూ అలాగే ఉండిపోయాడు. తనలో ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానికులు అతడు చనిపోయాడని భావించారు. వాళ్లు చూసి కూడా తమకు ఎందుకొచ్చిన గొడవని కేయూ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇక్కడ కొలనులో ఎవరో ఒక వ్యక్తి చనిపోయి పడి ఉన్నట్లు చెప్పారు. దాంతో.. పోలీసులు, 108 సిబ్బంది కోవెల కుంట దగ్గరికి చేరుకున్నారు. అప్పటికీ నీటిలోనే పడి ఉన్న వ్యక్తిని లేపేందుకు పోలీసులు ప్రయత్నించారు. సదరు వ్యక్తి చేయి పట్టుకుని లాగారు. ఆ వ్యక్తి వెంటనే పైకి లేచి నిల్చున్నాడు. దాంతో స్థానికులతో పాటు అక్కడున్న పోలీసులు ఒక్క సారిగా షాక్ తిన్నారు.
తీరా అతన్ని పరిశీలించగా.. ఫుల్ గా మద్యం సేవించి ఉన్నట్లు వారు గుర్తించారు. ఆ వ్యక్తిని వివరాలు అడగ్గా.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు. పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటలు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.