Chandrababu On jagan :   ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన జగన్‌ను ప్రజలు నమ్మకం అనుకోవడం లేదని దరిద్రం అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తూ.గో జిల్లా జగ్గంపేటలో  'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మూడున్నరేళ్ల పాలనతో రాష్ట్రాన్ని ముఫ్ఫై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. తప్పుడు విధానాలతో యువతకు ఉపాధి లేకుండా చేశారని..  తన బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఏ తల్లైనా చెప్పగలదా అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఇచ్చే పది రూపాయలు మాత్రమే కనిపిస్తోంది కానీ, దోచుకునే రూ.50 గురించి తెలుసుకుంటే వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని ప్రజలు తమ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానీయరన్నారు. 


ప్రజల కష్టాలకు కారకుడైన వ్యక్తే నమ్మకం అంటూ స్టిక్కర్ వేస్తారట 


జగన్‌ ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్‌లు వేస్తాడట.. 'నువ్వే మా నమ్మకం కాదు. నువ్వే మా దరిద్రం' అని ప్రజలు అంటున్నారని ...ఏమారితే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేసే వ్యక్తి జగన్‌ అని విమర్శించారు.  ప్రజల కష్టాలకు ప్రధాన కారకుడైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్‌ వేస్తాడట అని ఎద్దేవా చేశారు. సైకో జగన్‌ను ఇంటికి పంపేందుకు వీర నారీమణుల్లా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు. 





 పోలవరం పరిహారంలో అవినీతిపై సీబీఐ విచారణ 


పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్వాసితులకు సంబంధించి వెయ్యి ఎకరాల పరిహారాన్ని బోగస్‌ పట్టాలతో వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తెలుగుదేశం అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ జరిపిస్తుందని తెలిపారు. ప్రజాధనాన్ని హారతి కర్పూరంలా మింగేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భూములు సర్వే చేసి .. జగన్‌ తన బొమ్మలు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైకాపా పని అయిపోయిందని, ఇక గెలిచే అవకాశం లేదని దుయ్యబట్టారు.


చంద్రబాబుకు ఘన స్వాగతం 


తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. క్రేన్‌ ద్వారా ప్రతి సెంటరులో భారీ గజమాలలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి బూరుగుపూడి, కోరుకొండ మీదుగా గుమ్మళ్లదొడ్డికి చేరుకున్న చంద్రబాబుకు మహిళలు హారతులు పట్టారు. మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.           


చంద్రబాబు వాహనానికి ప్రమాదం 
 
టీడీపీ అధినేత చంద్రబాబు కారును మరో కారు ఢీ కొట్టిన ఘటన కలకలం రేపింది.   బురుగుపూడిలో చంద్రబాబు కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇలాంటి భద్రతా లోపాలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. వేరే కారు చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి ఎలా ఢీకొట్టిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.