Janasena Jayaketanam : జనసేన పార్టీ విజయోత్సాహంతో జయకేతనం సభ నిర్వహించుకుంటోంది. పన్నెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీని, జనసైనికులను టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు.  జన సేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్నదని..  పవన్ కల్యాణ్‌కు పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులందరికీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.  

ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మరో పార్టీ అధినేత శుభాకాంక్షలు చెప్పడం రాజకీయాల్లో అరుదే. అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడు  ఎన్డీఏలో ఉన్నారు. అందుకే చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు.                              

పిఠాపురంలో జయకేతనం పేరిట నిర్వహించనున్న ఈ సభావేదికపై అధినేత పవన్ కల్యాణ్​తోపాటు 200 మంది కూర్చునేలా తీర్చిదిద్దారు. వీవీఐపీలు, వీర మహిళలు, జనసైనికుల కోసం వేర్వేరు ప్రత్యేకంగా గ్యాలరీలు  సిద్ధం చేశారు. . సభా ప్రాంగణం బయట జాతీయ రహదారి వెంట భారీ LED తెరలు సిద్ధం చేశారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్‌ స్థలాలును సిద్ధం చేశారు.  రాత్రి 10 గంటల వరకు సభ సాగే అవకాశం ఉంది. జనసేన సభకు 17 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘాతోపాటు కాకినాడ కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్వవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.                     

2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది. అయితే జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్ది రాపాక వరప్రసాద్ గెలిచారు. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండుసీట్లలోనూ ఓడిపోయారు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి ఆయన పార్టీ సంచలన విజయాలు నమోదు చేసింది. కూటమిలో భాగంగా పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించింది. ఆ విజయోత్సాహాన్ని ఇప్పుడు పిఠాపురంలో నిర్వహించుకుంటున్నారు. 

సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత వచ్చిన విజయం కావడంతో జనసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా జనసైనికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారాన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కూటమి మరో పదిహేనేళ్లు ఉంటుందని పవన్ కల్యాణ్ అసెంబ్లీలో చెప్పారు.