Harish Rao: మా పండుగకు కారణం మీరే.. హరీష్ రావును కలిసి హెలీ విషెస్ చెప్పిన హైడ్రా బాధితులు!
Hyderabad News | ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ తమ కాలనీని కూల్చేందుకు రాగా, హరీష్ రావు అడ్డుకుని ప్రశ్నించారని.. ఈరోజు తమ పండుగకు ఆయనే కారణమని డ్రీమ్ కాలనీ వాసులు చెబుతున్నారు.

Telangana News Today | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు హైడ్రా బాధితులు సర్ ప్రైజ్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్భంగా హరీష్ రావును కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హైదర్ షా కోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు హోలీ సందర్భంగా హరీష్ రావును కలిసి, ఆయనకు ఓ పూల మొక్కను, ఓ మెమెంటోను ఇచ్చి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా (HYDRA) కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురైన పలు ఏరియాల వారికి హరీష్ రావు ధైర్యం చెప్పి, అండగా నిలిచారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని, హైదర్ షా కోట్ డ్రీమ్ కాలనీ వాసులు హరీష్ రావును కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు.

హైడ్రా కూల్చివేతలతో తమ ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల కిందట తెలంగాణ భవన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యను అర్థం చేసుకున్న హరీష్ రావు డ్రీమ్ కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చేశారని కాలనీ వాసులు చెబుతున్నారు.
ఆపదలో మమ్మల్ని ఆదుకున్నారు
"తాము ఆపదలో ఉన్నప్పుడు హరీష్ రావు మానవీయ దృక్పథంతో స్పందించి మాకు అండగా నిలిచారు. ఈ సాయం తాము ఎప్పటికీ మరిచిపోలేం. హరీష్ రావు తమ సేవాతత్పరతతో మా గుండెల్లో నిలిచిపోయారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఆయనకు హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలని వచ్చాం. ఈ పండుగ వేళ మరింత శక్తి చేకూరాలని’ కాలనీ వాసులు ఆకాంక్షించారు.
ఏ సమస్య వచ్చినా అండటా ఉంటామన్న హరీష్ రావు
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు డ్రీమ్ కాలనీ వాసులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ వాసుల కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీకు ఉంటుందన్నారు. బాధితుల కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి ఉన్నారు.