Andhra Pradesh another cyclone in November: ఆంధ్రప్రదేశ్ మొంథా తుఫాను విధ్వంసం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్ వచ్చేందుకు సిద్దమయింది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) నిపుణులు ఈ నెల 19 లేదా 20వ తేదీన బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది త్వరగా తుఫానుగా బలపడి, 25వ తేదీన తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని జిల్లాలపై భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 13-14 తేదీల్లో శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడి, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని ఐఎమ్‌డీ తెలిపింది.
అక్టోబర్ చివరిలో తీరాన్ని దాటిన మొంధా తుఫాను కోస్తా జిల్లాల్లో 350 మి.మీ. వర్షాలు కురిశాయి. 90-100 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ నష్టం జరిగింది. ఐఎమ్‌డీ హైదరాబాద్ , చెన్నై కేంద్రాల నుంచి జారీ చేసిన తాజా అలర్ట్ ప్రకారం, బంగాళాఖాతం మధ్య భాగంలో 19 లేదా 20వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది త్వరలో డిప్రెషన్‌గా మారి, తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. 25వ తేదీన కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొదట్లో 40-50 కి.మీ. వేగంతో గాలులు, తర్వాత 80-100 కి.మీ. వేగానికి పెరిగే అవకాశంని ఉందని చెబుతున్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.