AP Higher education:పరీక్ష ఒకటే....కోరుకున్న వర్శిటీలో సీటు...
నిన్నటి వరకూ ఓలెక్క..ఇకపై మరో లెక్క అన్నట్టు....ఒక్కో యూనివర్శిటీకి ఒక్కో ఎంట్రెన్స్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇకపై ఒకే పరీక్ష రాసి మీకు నచ్చిన విశ్వవిద్యాలయాన్ని, వాటి అనుబంధ కళాశాలని ఎంపిక చేసుకోవచ్చు. అంటే టెస్ట్ ఒకటే ఆప్షన్లు బోలెడన్నమాట.
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు, అఫిలియేటెడ్ కాలేజీల్లోని నాన్ ప్రొఫెషనల్ పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులకు ఏపీ పీజీసెట్ పేరిట ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
విద్యార్థులకు సమస్యలేకుండా....
నిన్నటి వరకూ ఆయా కోర్సుల్లో ప్రవేశాలకోసం ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో ప్రవేశ పరీక్ష నిర్వహించేది. ఒక విశ్వవిద్యాలయానికి మాత్రమే అప్లై చేసుకుంటే ఒకవేళ సీటు రాకపోతే ఏడాది కాలం వృధా అవుతుందనే భయం విద్యార్థుల్లో ఉంటుంది. అందుకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశం కోసం రెండు మూడు వర్శిటీలకు అప్లికేషన్ పెడతారు. ఎన్ని యూనివర్శిటీలకు అప్లై చేస్తే అన్ని ప్రవేశ పరీక్షలు రాస్తారు. ఇది విద్యార్థులకు కొంత కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏపీ పీజీసెట్ పేరిట ఒకే పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఆ ఇబ్బందులు తప్పుతాయి. ఒక పరీక్ష రాస్తే చాలు...ఏ విశ్వవిద్యాలయం పరిధిలో అయినా నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. పైగా అంతా ఆన్ లైన్ అవడం వల్ల సీట్ల భర్తీ కూడా పారదర్శకంగా జరిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ పీజీసెట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా కోరుకున్న వర్సిటీలో విద్యార్థులు సీట్లు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒక పరీక్షతో ఆప్షన్లు ఎక్కువగా ఉంటాయి. పైగా సంవత్సరం వృధా అవుతుందనే భయం లేకుండా ఏదో ఒక వర్శిటీ పరిధిలో సీటు మాత్రం తప్పనిసరిగా వస్తుందనే ధీమా ఉంటుంది. అయితే యూజీసీ చట్టం ప్రకారం వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నందున....ఒకే ప్రవేశ పరీక్షకు ఆయా వర్సిటీల పాలకమండళ్ల ఆమోదం తప్పనిసరి. ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు వర్సిటీలు ఆమోదం తెలిపిన తర్వాత ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
వర్సిటీ కాలేజీల విద్యార్థులకే ఫీజు రీయింబర్స్ మెంట్
ప్రైవేట్ పీజీ కాలేజీల్లో ప్రొఫెషనల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నట్లు గతేడాది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల్లోని ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. అటు ప్రైవేట్ కాలేజీల్లో నాన్ ప్రొఫెషనల్ పీజీ కోర్సులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని, వర్సిటీల్లో సీట్లు పొందిన వారికే మాత్రమే ఫీజులను ప్రభుత్వం భరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు..