బ్యాంకు కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) తీపి కబురు అందించింది. నాబార్డ్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 162 మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇందులో గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌, రాజ్‌భాష సర్వీస్‌, ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌)‌, గ్రేడ్‌-బీ మేనేజర్ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్) పోస్టులు ఉండనున్నాయి.


అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుల సవరణలకు ఆగస్టు 7 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలని పేర్కొంది. ప్రిలిమనరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు https://nabard.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది. 
విద్యార్హత..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55 శాతం) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 శాతం) ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొంది. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 
ఖాళీల వివరాలు.. (మొత్తం పోస్టులు: 162)
అసిస్టెంట్‌ మేనేజర్ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌) - 148
గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్ (రాజ్‌భాష సర్వీస్‌) - 5 
గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్ (ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌)‌ - 2
గ్రేడ్‌-బీ మేనేజర్ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్) - 7 
డిగ్రీ అర్హతతో SBIలో అప్రెంటిస్ జాబ్స్.. 




స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం దేశవ్యాప్తంగా 6100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో తెలంగాణలో 125, ఆంధ్రప్రదేశ్‌లో 100 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు స్వీకరణ జూలై 26వ తేదీతో ముగియనుంది. అర్హులు, ఆసక్తి ఉన్న వారు వీటికి దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.


ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ భాష వచ్చి ఉండాలని పేర్కొంది.