AP Election Counting Updates: ఓట్ల లెక్కింపు (AP Election Counting) సందర్భంగా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల (Counting Centers) వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించి వేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని, ఆర్‌వో ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఏ వ్యక్తిని అయినా ఓట్ల లెక్కింపు స్థలం నుంచి పంపించి వేయాలన్నారు. లెక్కింపు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, పోలీసులు, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
శాంతి భద్రతల బాధ్యత పోలీసులదే
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపు రోజున, తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఆటంకాలు తలెత్తితే వాటిని ధృఢంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరించాలన్నారు. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలను కఠినంగా అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను, ఇబ్బంది కలిగించే వారిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తప్పుడు వార్తలు, పుకార్లను వెంటనే ఖండించాలన్నారు.
మార్గదర్శకాల మేరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని ఆదేశించారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫాం-21సీ/21ఈ లను కౌంటింగ్ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘానికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకూడదని, ఇండెక్స్ కార్డులో తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పూరించాలని సూచించారు. ఈ నెల 8 లోపు ఇండెక్స్ కార్డులు అన్నీ కార్యాలయానికి అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఏజెంట్
ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ సందర్భంగా ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పించాలని సీఈఓ సూచించారు. ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఏజెంటుకు అవకాశం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు కౌంటింగ్ కేంద్రాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ఏజెంట్ చేతిలో ఫాం-17సీ, పెన్ను లేదా పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆ జర్నలిస్టులు అందరికి అవకాశం
అథారిటీ లెటర్స్ కలిగిన పాత్రికేయులు అందర్నీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలని, వారి వద్ద సెల్‌ఫోన్ ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పొద్దని సీఈఓ మీనా సూచించారు. కానీ కౌంటింగ్ సెంటర్‌లోకి మాత్రం సెల్‌ఫోన్‌తో అనుమతించడానికి వీల్లేదని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ అగ్ని రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశ, నిష్క్రమణ ప్రణాళిక పటిష్ఠంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు.