Central Team Inspection: ఆంధ్రప్రదేశ్‌లో రేపు కేంద్ర బృందం పర్యటించనుంది. పంచాయతీ నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగంపై ఏపీలో ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో తనిఖీ చేపట్టనుంది. రాష్ట్రంలో పంచాయతీ నిధులు మళ్లింపు, దుర్వినియోగం ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ ఆర్థిక సంఘం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయకుమార్ మంగళవారం రాష్ట్రానికి రానుంది. గ్రామ పంచాయతీలకు వెళ్లి వివరాలను సేకరించి రికార్డులు పరిశీలిస్తారని పంచాయతీ రాజ్ ఛాంబర్ పేర్కొంది. 


తమ ఫిర్యాదుతో ఏపీలో పరిశీలనకు కేంద్రం వస్తోందని వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అన్నారు.  కేంద్ర బృందానికి పూర్తి వివరాలు, వాస్తవాలను పంచాయితీరాజ్ ఛాంబర్, పంచాయతీ సర్పంచ్‌ల సంఘం అందిస్తుందని నేతలు పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిందని, దారిమళ్లించిందని వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కొద్దికాలంగా ఆరోపణులు చేస్తున్నారు. ఈ నేేపథ్యంలో కేంద్ర బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


ఆర్థిక సంఘం నిధులపై కేంద్రానికి ఫిర్యాదు
రాష్ట్రానికి కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో రూ.8,660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని ఏపీ పీఆర్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌ రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ ముత్యాలరావు, ఇతర ప్రతినిధుల బృందం ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సెక్రటరీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 


రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిశీలనకు కొన్ని పంచాయతీల పేర్లు సూచించాలని పీఆర్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌‌కు ఫోన్ చేసి డిప్యూటీ సెక్రటరీ కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పెదయాదర, కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని కోరుకొల్లు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని వంగిపురం పంచాయతీల పేర్లను వారు సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ నుంచి సైతం కొన్ని పంచాయతీల పేర్లను డిప్యూటీ సెక్రటరీ తెలుసుకున్నారు. 


మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిందా? లేదా? అనేది సర్పంచులు, కార్యదర్శులను అడిగి తెలుసుకోనున్నారు. నిధుల వ్యయంపై ప్రజల అభిప్రాయాలు సేకరిస్తారు. డిప్యూటీ సెక్రటరీ పర్యటన వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే సర్పంచులకు సంబంధించి పంచాయతీల పేర్లను డిప్యూటీ సెక్రటరీకి పంపారని తెలుస్తోంది.


పంచాయతీలకు కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను జగన్‌ ప్రభుత్వం సొంత అవసరాలకు మళ్లించిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తనీఖీ చేపట్టనుంది. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ కుమార్‌ కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు పంచాయతీలను సందర్శించి నిధుల కేటాయింపు, వ్యయం తదితర అంశాలపై ఆరా తీయనున్నారు.