Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహా నియంతలే మట్టిలో కలిసిపోయారని, మీరెంత? మీ అధికార మదం ఎంత? అంటూ మండిపడ్డారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపుతున్నారని లోకేశ్ విమర్శించారు.
ప్రజలను అడ్డుకుంటూ పోరాటాలను అణచివేయాలని చూసిన మహా నియంతలే మట్టిలో కలిసిపోయారని, మీరెంత? మీ అధికార మదం ఎంత? అంటూ లోకేష్ వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన ఐటీ ఉద్యోగులను అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దులో యుద్ధ వాతావరణం సృష్టించారని లోకేష్ మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే, మహిళలని కూడా చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధం అమలు చేశారని విమర్శించారు.
ప్రభుత్వ అరాచక విధానాలను ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధిస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. ప్రజా తిరుగుబాటుని అణచివేయాలని చూస్తే ఇంకా అధికమవుతుందని, వైసీపీ అరాచక పాలన అంతం కావడం ఖాయమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇంకెన్నాళ్లు అరాచక పాలన చేస్తారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అంటూ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలొస్తే మూడు నెలలు జగన్ ఇంటికి వెళ్తాడని, షెడ్యూల్ ప్రకారం జరిగితే ఆరు నెలల్లో జగన్ పార్టీ ఓట్ల వరదలో కొట్టుకు పోవడం ఖాయమని లోకేశ్ అన్నారు.
ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు: నారా భువనేశ్వరి
ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు. ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. తాను స్వయంగా ఓ సంస్థను నడుపుతున్నానని పేర్కొన్నారు. ఆ సంస్థలో రెండు శాతం వాటా అమ్ముకున్నా 400 కోట్లు వస్తాయని తెలిపారు.
చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి మీ కోసం మళ్లీ పని చేస్తారని అన్నారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని, ప్రజల్ని ముందుకు నడిపించడమే చంద్రబాబు లక్ష్యం అన్నారు. అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం కంటే ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుందన్నారు. ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. అలాంటి వ్యక్తి తప్పులెందుకు చేస్తారని ప్రశ్నించారు.
హైటెక్ సిటీ ఆయనే కట్టారు
రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా అని భువనేశ్వరి నిలదీశారు. హైదరాబాద్ లో రాళ్లు, రప్పలున్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మించారని, కనీసం సదుపాయాలు లేని ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని ఆనాడు అందరూ నవ్వారని అన్నారు. కానీ ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారని. ఐటీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. చంద్రబాబు సంపద సృష్టించే నాయకుడు అన్నారు. బ్రిటిష్ పాలకుల కాలంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు జైలుకు వెళ్లారు.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజల కోసం జైలుకు వెళ్లారని వ్యాఖ్యానించారు.