తెలంగాణలో త్వరలో ఎన్నికలు ఉన్నందున రాజకీయ నేతల జంపింగ్‌లు ఎక్కువ అవుతున్నాయి. అసంతృప్తులు పక్కా పార్టీల్లోకి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా, ఇప్పుడు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వదిలేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం తనకు కాదని నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు టికెట్ ఖరారు చేయడంతో.. అప్పుడు ముందుగానే పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


అయితే అప్పుడు ఆయనే స్వయంగా తాను పార్టీ మారడం లేదని వెల్లడించారు. కొద్ది రోజులు పార్టీ అభ్యర్థితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతున్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఆయన అనుచరుల ఒత్తిడి కారణంగా ఆయన పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏ పార్టీలో చేరతారనే విషయంపై రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంది. ఆయన హస్తం గూటిలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


టికెట్‌ ఇవ్వకపోవడంపై అసహనం


బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు తాను ఎమ్మెల్యేగా ఏ తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. అయినా బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో బాపూరావు సమాలోచనలు, చర్చలు జరిపారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.


దక్కని కేటీఆర్‌ అపాంట్‌మెంట్‌


మరోవైపు, మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ నుంచి స్పందన రాకపోవడం వల్ల ఇక బీఆర్ఎస్ పార్టీని వదిలేయాలనే  నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించడం వల్ల రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు.