Central Team Meet With CM Chandrababu: ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) కేంద్ర బృందాన్ని కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో ఆయన సచివాలయంలో గురువారం భేటీ అయ్యారు. గత రెండ్రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన బృంద సభ్యులు వరద నష్టంపై అంచనా వేశారు. ఎంత నష్టం వచ్చిందనే దానిపై చేపడుతోన్న ఎన్యూమరేషన్‌పై సీఎంకు వివరణ ఇచ్చారు. కాగా, వరదల వల్ల ప్రాథమికంగా రూ.6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల నివేదిక ఇచ్చింది. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు ముఖ్యమంత్రి వివరించారు. 


ప్రకాశం బ్యారేజీ సందర్శన


మరోవైపు, ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. వరద సమయంలో, ప్రస్తుతం నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలను జల వనరుల శాఖ అధికారులు వారికి వివరించారు. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి వారు తీసుకెళ్లారు.


మంగళగిరిలో బృందం పర్యటన


అటు, గుంటూరు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం వరద నష్టాలను అంచనా వేసింది. మంగళగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన చేనేత మగ్గాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఆశిస్తున్నారనే దానిపై బాధితులను అడిగి తెలుసుకుని.. వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం తాడేపల్లిలోని మహానాడు ప్రాంతాన్ని కేంద్ర బృందంతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. కృష్ణా నది వరద ప్రవాహానికి మహానాడులోని దాదాపు 800 ఇళ్లు నీట మునిగాయని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. అటు, వరద తర్వాత తమ ప్రాంతంలో బురద, దుర్గంధం పేరుకుని దోమలు వ్యాపిస్తున్నాయని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.


ముమ్మరంగా బోట్ల వెలికితీత పనులు


అటు, ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. ఇక చేసేది లేక బోట్లను ముక్కలు చేయాలని భావించి పదు మంది నిపుణులతో కూడిన బృందం బోట్లను కట్ చేసి తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ ప్రక్రియ కష్టతరంగా మారింది. పడవల తొలగింపు పనులను మంత్రి  నిమ్మల రామానాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పడవ దృఢంగా ఉండడంతో కోత ఆలస్యమవుతోందని చెప్పారు. పడవలను పూర్తిగా ముక్కలుగా కోసి వాటిని తరలించే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా, బోట్లను తొలగించేందుకు ప్రభుత్వం భారీగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం