Polavaram Central Team Visit : పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు సీడబ్యూసీ లోని పలు విభాగాలకు చెందిన నిపుణులు నాలుగు రోజుల పాటు పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు పర్యటనకు వచ్చిన అధికారులు తాజాగా మరో సారి అంటే ఎడో సారి కూడా పరిశీలించనున్నారు. నిపుణుల కమిటితో జాతీయ ప్రాజెక్టుల మానిటరింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ నిఖల్ వస్తున్నారు. శనివారం ప్రాజెక్ట్ ప్రదాన పనులతో పాటుగా కాఫర్ డ్యాం, స్పిల్ వే, ఎడమ, కుడి కాల్వల పనులు, అనుబంధంగా జరిగే పనులతో పాటుగా నది మధ్యలో కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏడో సారి పోలవరం పరిశీలనకు వస్తున్నకేంద్ర నిపుణుల కమిటీ
ఆదివారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబందించినంత వరకు ఎపీకి అత్యంత కీలకమయిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఎపీ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీని పై ఇప్పటి కే రాజకీయ దుమారం కూడ కొనసాగున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎపీ సీఎం జగన్ పోలవరం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిధుల విడుదల పై ఇప్పటికే అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడ తీసుకువెళ్ళారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని ప్రధానిని కలసి జగన్ విజ్ఞప్తి చేశారు.
సవరించిన అంచనాలు ఆమోదించాలని సుదీర్ఘ కాలంగా జగన్ విజ్ఞప్తి
2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రధాని దృష్టికి జగన్ తీసుకువెళ్ళారు. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది..ఇందులో నిర్మాణ పనుల కోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసం కోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్క్షప్తి చేసింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించింది.
డయాఫ్రం వాల్ పై క్లారిటీకి వస్తారా ?
కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను పరిగణలోకి తీసుకోవాలని ఎపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది.అంతే కాకుండా నిధులను సకాలానికే విడుదల చేయాలని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని కూడ జగన్ ఇటీవల ప్రదాని దృష్టికి తీసుకువెళ్ళారు.జగన్ ప్రదానిని కలసిన తరువాత మరో సారి కేంద్ర బృందం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న భాగాన్ని ఎలా బాగు చేయాలన్నది నిపుణులు తేల్చాల్సి ఉంది.