Union Minister Kumara Swamy Key Comments On Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించడం తమ బాధ్యత అని.. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumara Swamy) అన్నారు. విశాఖ (Visakha) పర్యటనలో భాగంగా ఆయన గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను (Visakha Steel Plant) సందర్శించారు. ఉక్కు ఉత్పత్తి సహా అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల వివరాలను కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. ప్లాంట్స్ సందర్శన అనంతరం కుమార స్వామి మీడియాతో మాట్లాడారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఉక్కు పరిశ్రమపై అనేక మంది ఆధారపడి ఉన్నారు. ప్రజలు, సిబ్బంది ఎలాంటి ఆందోళనలు చెందొద్దు. విశాఖ ప్రైవేటీకరణకు అవకాశం లేదు. ఇక్కడ పరిశీలించిన ప్రతీ అంశాన్ని నోట్ చేసుకున్నా. ప్రధాని మోదీకి (PM Modi) అన్ని అంశాలను వివరిస్తా. ఆయన ఆశీస్సులతో పరిశ్రమలో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది.' అని కుమార స్వామి స్పష్టం చేశారు.
'దుష్ప్రచారాలు నమ్మొద్దు'
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నామని.. తెలుగు వారు ఆత్మగౌరవం కోసం పుట్టిన పరిశ్రమ, ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీ అసత్య ప్రచారం తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాను ఒప్పుకొన్నాననే ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గొర్రెపిల్ల, కుక్కపిల్ల కథను ఉద్ఘాటించారు. గొర్రెపిల్లను తీసుకెళ్తుంటే కుక్క పిల్లని తీసుకెళ్తున్నావంటూ ఒకరు అంటారని.. ఆ తర్వాత మరొకరు, ఇంకొకరు సైతం అలాగే అంటారని చెప్పారు. దీన్ని నమ్మిన గొర్రె పిల్లను తీసుకెళ్లే వ్యక్తి అది కుక్క పిల్లే అని నమ్మి వదిలేస్తే దాన్ని వారు కాజేస్తారని, వైసీపీ వాళ్లు సైతం ఇలాగే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడతామని స్పష్టం చేశారు.
'విశాఖను దోచేశారు'
ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన అనకాపల్లి జిల్లా దార్లపూడిలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.800 కోట్లు ఖర్చవుతుంది. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వంశధార వరకూ వెళ్తుంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులకు అనుసంధానం చేయాలి. దీంతో రాష్ట్రంలో కరువు అనేది ఉండదు. వైసీపీ హయాంలో అనకాపల్లి జిల్లాలో 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నింటినీ నెరవేరుస్తాం.' అని సీఎం పేర్కొన్నారు.