Z Category Security To Nara Lokesh: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలతో ఆదివారం నుంచి జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. మావోయిస్టుల హెచ్చరికలు, యువగళం (Yuvagalam) పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనకు కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని శనివారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ఆ ఆదేశాలు అమలు చేస్తూ అధికారులు లోకేశ్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. 22 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో ఆయన భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తారు. వీరిలో నాలుగు నుంచి ఐదుగురు ఎన్ఎస్ జీ కమాండోలు ఉంటారు. 



భద్రతను తగ్గించిన ప్రభుత్వం


ముప్పు ఉన్నా నారా లోకేష్‌కు (Nara Lokesh) వైసీపీ ప్రభుత్వం భద్రత తగ్గించిందని, తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర హోమ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి ఆయన భద్రతా సిబ్బంది 14 సార్లు లేఖలు రాశారు. భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని పలుమార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. యువగళం పాదయాత్రలో లోకేష్ టార్గెట్ గా అనేక సార్లు వైసీపీ ప్రేరేపిత భౌతిక దాడులు జరిగాయంటూ రాష్ట్ర హోమ్ శాఖ, కేంద్ర హోమ్ శాఖ, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అటు, అక్టోబర్ 2016 ఏఓబీ ఎన్ కౌంటర్ తర్వాత లోకేశ్ కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే, వాటిని పక్కన పెట్టిన ప్రభుత్వం లోకేశ్ కు వై కేటగిరి భద్రత మాత్రమే కల్పిస్తూ వస్తోంది. దీనిపై లోకేశ్ భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు.. సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది.


వైసీపీపై లోకేశ్ సెటైర్లు


టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే.. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో ఆదివారం ఆయన సమావేశమై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఇసుక విధానం తీసుకొస్తామని.. ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని.. అక్రమ మద్య నియంత్రణ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ, సీఎం జగన్ (CM Jagan) పై సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. సీఎం జగన్ మహా నటుడని ఆయన రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి వస్తే ఆస్కార్ తో పాటు భాస్కర్ అవార్డులు సైతం వస్తాయంటూ ఎద్దేవా చేశారు.


Also Read: Botsa Satyanarayana: నాకు గన్ మెన్ కూడా ఇవ్వలేదు, లోకేష్‌కు Z కేటగిరి సెక్యూరిటీనా? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు