Union Government Gazzatte Notification For Amaravati Rail Line: ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిలో (Amaravati) అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు (Chandrababu) సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి గురువారం ఆయన అమరావతిలో పర్యటించారు. ప్రజావేదిక కూల్చేసిన చోటు నుంచి ఆయన పర్యటన ప్రారంభం కాగా.. అక్కడి శిథిలాలు, నిర్మాణం కాని అసంపూర్తిగా ఉన్న భవనాలను పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం వద్ద సీఎం చంద్రబాబు మోకాళ్లపై కూర్చుని సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమరావతికి గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడి కొత్త రైల్వే లైన్‌కు క్లియరెన్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రైల్వే శాఖ.. అమరావతి రైల్వే లైన్ భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 


గతంలో అలా.. ఇప్పుడు ఇలా..


గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి.. భూ సేకరణ వ్యయం భరించాలి అనే షరతులతో కాలయాపన చేసిన రైల్వే శాఖ.. ఇప్పుడు అవేమీ లేకుండానే పూర్తిగా తమ నిధులతోనే రైల్వే లైన్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రధానంగా ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు మధ్య భూ సేకరణకు ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 


106 కి.మీ మేర కొత్త లైన్


విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లతో ఏపీ రాజధాని అమరావతి కనెక్టవిటీ కోసం.. కొత్త రైల్వే లైన్ 2017 - 18లో మంజూరైంది. ప్రధానంగా ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు మధ్య 56.53 కిలో మీటర్ల మేర డబుల్ లైన్.. అలాగే అమరావతి - పెదకూరపాడు మధ్య 24.5 కి.మీ సింగిల్ లైన్‌కు కసరత్తు చేస్తున్నారు. అలాగే, సత్తెనపల్లి - నరసరావుపేట మధ్య 25 కి.మీల సింగిల్ లైన్‌ను కూడా కలిపితే మొత్తం 106 కి.మీ మేర కొత్త లైన్‌కు ఆమోదం తెలిపారు. అయితే, గత ఐదేళ్లలో ఈ రైల్వే లైన్లలో ఎలాంటి ముందడుగు పడలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.


ప్రధానంగా ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు మధ్య 56.53 కి.మీ మేర డబుల్ లైన్ నిర్మాణం చేయాలని భావించారు. దానికి బదులు మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్‌కు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు. ఈ లైన్ నిర్మాణానికి, భూ సేకరణకు రూ.2,600 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ - హైదరాబాద్ లైన్‌లో ఎర్రుపాలెం దగ్గర మొదలై.. అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడ లైన్‌లోని నంబూరు దగ్గర కలుస్తుంది. అటు, ఎర్రుపాలెం తర్వాత 9 కొత్త స్టేషన్లను.. పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరుల్లో నిర్మిస్తారు. వీటిల్లో అమరావతి, కొప్పురావూరు, పెద్దాపురం, పరిటాల పెద్ద స్టేషన్లుగా ఉండనున్నాయి. ఈ రైల్వే లైన్‌లో భాగంగానే కృష్ణా నదిపై కొత్తపేట - వడ్డమాను మధ్య 3 కి.మీ మేర వంతెన కూడా నిర్మించనున్నారు.


Also Read: Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా వస్తా అన్నారు- అఖండ మెజార్టీతో వచ్చారు- సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు