Andhra Pradesh Assembly: చంద్రబాబు అన్న మాటను నిలబెట్టుకున్నారు. అయిదేళ్ల క్రితం 23 స్థానాలకే పరిమితమైన స్థాయి నుంచి.. అసెంబ్లీలో వ్యక్తిత్వ హననం, తన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానం, అధికార పక్ష సభ్యుల వ్యక్తిగత ధూషణల నేపథ్యంలో  ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ,  తిరిగి ఈ సభకు ముఖ్యమంత్రిగానే వస్తానని సవాలు చేసిన చంద్రబాబు రెండున్నరేళ్లు తిరిగేసరికీ అన్నంత పనీ చేశారు. నిజానికి అంతకు మించే చేశారు. తనను, తన పార్టనీ తీవ్ర అవమానాలకు గురి చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేసి తలెత్తెకుని అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబుకు అసెంబ్లీలో ఎదురైన అవమానాలు చూసిన వారెవ్వరూ మళ్లీ ఆయన పుంజుకోగలుగుతారని ఊహించి ఉండరు. 


అయిదేళ్ల నరకం.. 


45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుకి మొదటి 40 ఏళ్లు ఒక ఎత్తయితే ఈ అయిదేళ్లు ఒకెత్తు. ఈ విషయం చంద్రబాబే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు చెప్పారు. గతంలో ఆయన మహా మహా నాయకులను ఢీకొట్టారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. గెలిచిన పార్టీ నాయకులు ఓడిన నాయకులను విమర్శించడం, ప్రతిపక్షం సైతం అధికార పక్షంపై రాజకీయ విమర్శలు చేయడం సహజం. కానీ జగన్ మార్కు కక్ష సాధింపు రాజకీయం మాత్రం ఆయన ఎదురు చూసింది కాదు.  ఎన్నడూ లేనన్ని అవమానాలూ, కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు.  టీడీపీ నాయకుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీశారు. ఆత్మస్థైర్యాన్ని నీరుగార్చారు. అక్రమ కేసులు బనాయించారు. భౌతిక దాడులు, హింస యథేచ్చగా సాగాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినా అప్పటి ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. ఏకంగా చంద్రబాబు ఇంటిపైనకు ఓ నేత మందీ మార్బలంతో దండెత్తినా చర్యల్లేవు. 


వెకిలి మాటలు.. వెకిలి నవ్వులు.. 


చంద్రబాబుపై, తెదేపా నాయకులపై వైసీపీ నాయకులు వెకిలి మాటలతో రెచ్చిపోతోంటే నిలువరించాల్సిన జగన్ అసెంబ్లీలో వారిని నవ్వుతూ ప్రోత్సహించారు. చివరికి తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడేసరికి చంద్రబాబు తట్టుకోలేక పోయారు.  తిరిగి ముఖ్యమంత్రయ్యాకే అసెంబ్లీకొస్తానంటూ శపథం చేసి బయటకు వచ్చారు. మీడియా సమావేశంలో ఎప్పుడూ హుందాగా ఉండే మనిషి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘పెద్ద పెద్ద నాయకులతో పనిచేశాం. కానీ ఈ రెండున్నరేళ్లలో పడ్డ అవమానాలు ఎప్పుడూ చూడలేదు. వ్యక్తిగతంగా, పార్టీపరంగా అవమానించారు. ఏ పరువు కోసం ఇన్నేళ్లుగా బ్రతికానో.. . నా కుటుంబం, నా భార్య విషయం కూడా సభలోకి తీసుకొచ్చ దారుణంగా అవమానించారు’’ అని  భావోద్వేగానికి లోనయ్యారు. 


చివరగా చంద్రబాబు మాట్లాడిన మాటలివీ.. 


2021 నవంబరు 19వ తేదీన అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనీకుండా చేశారు కాబట్టి..  ముఖ్యమంత్రిగానే మళ్లీ ఈ హౌస్‌కొస్తా.  లేకపోతే నాకీ రాజకీయాలు అవసరంలేదు. ఇదొక కౌరవ సభ.  గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం.  నాకు జరిగిన అవమానాన్ని ప్రజలంతా అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’అని తన పార్టీ నాయకులతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.  తిరిగిఇన్నాళ్ల తరువాత ఆయన ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు.


సమస్యలపై స్వరం.. జైలు జీవితంతో కలవరం


అసెంబ్లీలో శపథం అనంతరం సైతం చంద్రబాబు పార్టీని, క్యాడర్ ని నిలబెట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. రాష్ట్రమంతటా సభలు, సమావేశాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు. నవయువకుడిలా రాష్ట్రంలో ఎక్కడ సమస్య జరిగినా ఎలుగెత్తి చాటారు. అమరావతిపై పోరాడారు. జంగారెడ్డి గూడెంలో నాటు సారా మరణాలపై గళమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే తాను ఏదైతే జీవితంలో చూడకూడదనుకున్నారో అది కూడా చూశారు.   స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎ37 గా ఆయన్ని అరెస్టు చేయడంతో 53 రోజులు జైలు జీవితం సైతం గడిపారు. అక్కడి నుంచే పార్టీకి ఆదేశాలిస్తూ కుమారుడు లోకేష్ సాయంతో కార్యక్రమాలు రూపొందించారు. ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు.


పవన్ సాయం మరువని వైనం


జనసేన, భాజపాతో కలిసి 164 స్థానాలతో చరిత్రలో లేని విజయం సొంతం చేసుకుని, జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేసి సింహంలా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు చంద్రబాబు. అయితే తాను జైలులో ఉన్న సమయంలో తనకు జనసేన అధినేత పవన్ అండగా నిలిచిన తీరుని చంద్రబాబు మరువలేదు.  ఇప్పటికీ చంద్రబాబు పలు సందర్భాల్లో పవన్ తనకు, పార్టీకి నైతిక స్థైర్యం ఇచ్చిన సంగతి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తరువాత సైతం ఆయనకు తన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. అంతే కాకుండా తన ఫొటోతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ పవన్ ఫొటో కూడా ఉండాలని ఆదేశించి తన మనసులో పవన్ స్థానమేంటో చూపించారు.