Free DSC Coaching in BC Study Circles: ఏపీలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు డీఎస్సీ కోచింగ్‌ను ఉచితంగా అందిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. సచివాలయంలో గురువారం (జూన్ 20) ఆమె బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తొలి సంతకాన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్, రెండో సంతకాన్ని ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణపై చేశారు.
ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి సవిత వెల్లడించారు. 2014-19 మధ్య 74 బీసీ గురుకులాలను తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్య కింద అప్పట్లో 2,173 మంది బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ఆర్థిక సాయం అందించామన్నారు మంత్రి. కానీ గత ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్య కింద ఆర్థికసాయం అందించింది 89 మందికే. వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని మంత్రి మండిపడ్డారు.
రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ (BC Commission) ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవనాల నిర్మాణాలను సైతం శీఘ్రగతిన పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు,హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు,రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను 106 కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే అన్నారు.
త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా మెగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిప్రకారం.. 16347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.
కొత్త నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు.
మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు..
క్ర.సం. | విభాగం | పోస్టుల సంఖ్య |
1) | స్కూల్ అసిస్టెంట్ (SA) | 7725 |
2) | సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) | 6371 |
3) | ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) | 1781 |
4) | పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) | 286 |
5) | ప్రిన్సిపల్స్ | 52 |
6) | ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) | 132 |
- | మొత్తం ఖాళీలు | 16,347 |