ప్రత్యేకహోదా అంశం ఏపీలో ఎప్పుడూ హాట్ టాపికే. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌  పూర్తి వివరాలు చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నలకు ఇందర్ జిత్ సింగ్ ఈ జవాబు చెప్పారు. కేంద్రమంత్రి చెప్పిన దాని ప్రకారం  జనరల్‌ కేటగిరీ రాష్ట్రాలు, స్పెషల్‌ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం నిర్దేశించలేదు. అంటే ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రం అనే దానికి ఉనికి లేదు. అంతకు ముందు ప్రత్యేకహోదా ఉంటే  సాధారణ కేంద్ర సహాయం (ఎన్సీఏ), ప్రత్యేక ప్రణాళికా సాయం (ఎస్పీఏ), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్సీఏ) కింద లబ్ధి చేకూరేది.  అయితే సెంట్రల్ పూల్‌లో జమ అయ్యే టాక్స్‌లు, సెస్‌ల పంపిణీలో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ సిఫార్సు చేసినందున ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పైన వివిధ రూపాలలో కేంద్రం చేసే సహాయాన్ని రద్దు చేశారు. అంటే ప్రత్యేకహోదాను పూర్తిగా రద్దు చేసినట్లు అన్నమాట. ఇదే విధానాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తమ సిఫార్సులలో సమర్ధించడంతో ఈ విడతకు కూడా ప్రత్యేకహోదా ఇవ్వడం లేదు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని అందుకే ఇవ్వలేదని ఇప్పటికే కేంద్రం చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు మరోసారి చెప్పింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చెప్పించారని అనుకోవచ్చు. 


కేంద్ర ప్రాయోజిత పథకాలను హేతుబద్దీకరించేందుకు నియమించిన ముఖ్యమంత్రుల ఉప సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పథకాలలో రాష్ట్రాల వాటాను కూడా మార్పు చేసినట్లు తెలిపారు. ఉప సంఘం సిఫార్సులకు అనుగుణంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు కేంద్ర పథకాలలో తమ వాటా కింద 10 శాతం చెల్లించాలన్నారు.జనరల్‌ కేటగిరీ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర పథకాలలో కేంద్రం 60 శాతం  నిధులు భరిస్తే రాష్ట్రాలు 40 శాతం భరించాలని నిర్ణయించడం జరిగింది. 2016-17 నుంచి ఈ ఫార్ములా అమలులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ ఫండింగ్‌ విధానం ముఖ్యమంత్రుల ఉప సంఘం సిఫార్సులను అనుసరించి అమలు చేసింది తప్ప ప్రత్యేక హోదా కలిగినందుకు కాదని మంత్రి స్పష్టం చేశారు. 


అలాగే విబజన హామీల్లో భాగంగా  ఏపీ రెవెన్యూ లోటును కూడా కేంద్రం భర్తీ చేసిందని 2015-20 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల వరకూ  రూ.28 వేల కోట్లు విడుదల చేసినట్లు ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 ప్రకారం, ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రాతిపదికన కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రాయోజిత పథకాలలో 90:10 నిష్పత్తో 2015-16 నుంచి 2019-20 వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.20,557 కోట్ల విడుదల చేసిందని కేంద్ర మంత్రి లెక్కలు విడుదల చేారు.