విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని.. అది చట్టబద్ధమైన అధికారాలతో తీసుకున్న నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ న్యాయపోరాటం చేస్తున్నారు.  ఏపీ హైకోర్టులో ఆయన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని.. ఇలాంటి నిర్ణయాలపై విచారణ తగదని అఫిడవిట్‌లో తెలిపింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. 


అదే సమయంలో.. పిటిషన్ దాఖలు చేసిన వీవీ లక్ష్మినారాయణకు కేంద్రం రాజకీయ ఉద్దేశాలు అంటగట్టింది. ఆయన రాజకీయ లబ్ది పొందడానికే పిటిషన్ వేశారని ఆరోపించింది. ఆయన పిల్‌కు విచారణార్హత లేదని కొట్టి వేయాలని కోరింది. అయితే కేంద్రం చెప్పినట్లుగా వీవీ లక్ష్మినారాయణ రాజకీయ లబ్ది పొందడానికి .. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరు. గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పటికీ.. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి.. సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. రైతులు, వ్యవసాయం ఇతర అంశాలపై ఆయన అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన ఇంకా.. రాజకీయాల్లో ఉన్నారని అనుకుందేమో కానీ... రాజకీయలబ్ది కోసం పిటిషన్ వేశారని ఆరోపించేసింది. కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వీవీ లక్ష్మినారాయణ చురుగ్గా పాల్గొంటున్నారు. ఉద్యమకారులకు మద్దతు తెపుతున్నారు. మొదట్లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో అనేక కీలకమైన అంశాలను పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్రం విశాఖ ఉక్కుపై 5 వేల కోట్లు ఖర్చు చేసిందని.. కానీ 30 వేల కోట్లు టాక్స్ రూపంలో వసూలు చేసిందని లక్ష్మినారాయణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ను ప్రభుత్వరంగంలో కొనసాగిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం.. వీవీ లక్ష్మినారాయణ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై స్పందించలేదు. స్టీల్ ప్లాంట్ దేనికి అమ్ముతున్నారో... అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుందో.. అసలు ఎంత ఖర్చు పెట్టారు.. ఎంతకు అమ్ముతున్నారన్నదానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. కానీ.. అమ్మడానికి అధికారం ఉందని మాత్రం తేల్చి చెబుతోంది. అమ్మే అధికారం ఉందని అమ్ముతున్నాం కానీ..  అసలు అమ్మాల్సిన అవసరం ఏమిటనేది.. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో లేకపోవడం.. చర్చనీయాంశం అవుతోంది.