Center Announces 11440 Crore Bail Out Package To Vizag Steel Plant: ఆర్థిక కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పునరుజ్జీవ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. మొత్తంగా రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదట రూ. 17వేల కోట్లన్న ప్రచారం జరిగింది. తర్వాత రూ. 10330 కోట్లు అని చెప్పుకున్నారు. అయితే అధికారికంగా 11,440 కోట్ల రూపాయలను కేంద్రం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ కింద ప్రకటించింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాం 2023-24లో రూ. 4548.86 కోట్లు, అలాగే 2022-23లో రూ.2858.74 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ క్రమంలో వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడంతో ఈ పరిశ్రమకు నష్టాలు వెంటాడాయి. అందుకే గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడం... ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించి తర్వాత.. ఆ సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకునే అవకాశం ఉంది.
విశాఖ ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తు న్నారు. ప్లాంట్ కు ఉన్న ఆర్దిక ఇబ్బందులతో ముడి పదార్ధాలను సమకూర్చుకోవటం సమస్య గా మారుతోంది. దీంతో, రెండు బ్లాస్ట్ ఫర్నేసులనే నిర్వహిస్తున్నారు. ముడిపదార్థాల కొరత కారణంగా స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గింది. ముడిసరుకు కొరతతో స్టీల్ ప్లాంట్‌లోని రెండు ఫర్నేసులలో ఉత్పత్తి నిలిపేశారు. ఈ సమయంలో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల ఏర్పాటు కోసం నిధులు వెచ్చించే అవకాశం ఉంది. ఈ కొత్త ఫర్నేసుల ఏర్పాటు కోసం ఒక్కొక్క దానికి రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. మూడింటికీ రూ.7,500 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తారు. లాంగ్ ప్రొడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతు ల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్‌ను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. మరో పది వేల కోట్లను నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చే అవకాశం ఉంది.