YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచాణలో సీబీఐ కీలక విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం టెక్నికల్‌గా వైఎస్ ఆవినాష్ రెడ్డి సాక్షిగానే ఉన్నారని తెలిపిన సీబీఐ.. అవసరం అయితే అదుపులోకి తీసుకుంటామని న్యాయమూర్తికి తెలిపింది. ఇప్పటికే మూడు సార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించామని ప్రతీ సారి వీడియో రికార్డ్ చేశామని స్పష్టం సీబీఐ అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్ డిస్క్‌ను హైకోర్టుకు తెచ్చారు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్. హార్డ్ డిస్క్, కేసు ఫైల్ ఇప్పుడే ఇచ్చేందుకు తాము సిద్ధమని తెలిపారు.
వైఎస్ అవినాష్ విచారణ మొత్తాన్ని రికార్డ్ చేశామన్న సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబందించిన వివరాలు, హార్డ్ డిస్క్‌ను సోమవారం సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ న్యాయవాది ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్బంగా అవినాష్‌రెడ్డి.. సాక్షా? నిందితుడా? అని సీబీఐని హైకోర్టుప్రశ్నించారు. అవినాష్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చామని.. అవసరమైతే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని తెలిపింది. దీంతో సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మంగళవారం మరోసారి అవినాష్ విచరాణకు హాజరవుతారని హైకోర్టు తెలిపింది.
హత్యా స్థలంలో దొరికిన లేఖపై సీఎఫ్‌ఎస్‌ఎల్ అభిప్రాయం తీసుకున్నామన్న సీబీఐ
హత్యాస్థలంలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని ..లేఖపై సీఎఫ్‌ఎస్‌ఎల్ అభిప్రాయం తీసుకున్నామన్న సీబీఐ హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సీఎఫ్‌ఎస్‌ఎల్ తెలిపిందన్నారు. దీంతో న్యాయమూర్తి లేఖతో పాటు సీఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సునీత ఇంప్లీడ్ పిటిషన్‌పై అభ్యంతరం ఉందా అవినాష్ రెడ్డి, సీబీఐ తరపు లాయర్లను హైకోర్టు ప్రశ్నించింది. అయితే అభ్యంతరం లేదని వారి తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని పిటిషన్‌లో కోరారని... తీవ్రమైన చర్యలంటే ఏంటని అవినాష్ రెడ్డి తరపు లాయర్‌ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించారు. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా అని ప్రశ్నించింది.
విచారణ సోమవారానికి వాయిదా
అయితే చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం చేస్తున్నారన్న నమ్మకం లేదని... అవినాష్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ తరఫు లాయర్ స్పష్టం చేశారు. వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో తెలపాలని ..కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణ సోమవారం జరగనుంది.