YS Avinash Reddy CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీబీఐ ఆఫీసుకు వచ్చిన ఆయన ఐదున్నర సమయంలో బయటకు వచ్చారు  హైదరాబాద్‌లోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన అవినాష్‌ను… సీబీఐ అధికారులు విచారించారు. విచారణకు న్యాయవాదులను అనుమతించాలని అవినాష్ రెడ్డి కోరారు. అయితే సీబీఐ అధికారులు అంగీకరించలేదు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్   బృందం అవినాష్ రెడ్డిని విచారించింది.  విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాపై మండిపడ్డారు. తనపై మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని  ఆరోపించారు. గతంలో టీడీపీ చేసిన విమర్శలను ఇప్పుడు సీబీఐ కౌంటర్‌లో వేసిందన్నరు. తనను సీబీఐ అధికారులు మళ్లీ రావాలని చెప్పలేదన్నారు. ఓ అబద్దాన్ని సున్నా నుంచి వందకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు.  


కీలక అంశాలపై విచారణ !              


గత విచారణలో  కాల్ డేటా ఆధారం గా విచారణ జరిపారు. ఆ సమయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిల పీఏలకు ఫోన్ చేసినట్లుగా తెలిపారు. దీంతో వారినీ సీబీఐ విచారించింది.  శుక్రవారం నాటి విచారణలో  బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.  దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను ప్రస్తావిస్తూ అవినాష్‌ను విచారిస్తున్నరని అంటున్నారు.  వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. 


ఇప్పటికే అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ అఫిడవిట్              


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్‌ వివేకానంద రెడ్డిని అవినాశ్‌ రెడ్డే చంపించారని, అందుకు సాక్ష్యాలన్నీ ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తేల్చి చెప్పింది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (A2) బెయిల్‌ పిటిషన్ కు కౌంటర్ గా తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్ లో ఎన్నో సంచలన విషయాలను దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది. తమ విచారణలో భాగంగా తేలిన విషయాలను సీబీఐ ఆ పిటిషన్‌లో వివరించింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో ఒప్పందం కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది.


హత్యకు ముందు నిందితులందరూ అవినాష్ రెడ్డి ఇంట్లోనే


వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్యకు కదిరి నుంచి గొడ్డలి తీసుకురావడానికి వెళ్లిన దస్తగిరి రాక కోసమే సునీల్‌యాదవ్‌ అవినాష్‌ రెడ్డి ఇంట్లో ఎదురు చూస్తున్నట్లు తేలిందని తెలిపింది. వివేకా హత్య ఘటన వెలుగులోకి రావడానికి కొంత సమయం ముందు (2019 మార్చి 15 తెల్లవారుజామున) నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని పేర్కొంది.