Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇనయతుల్లా వివేకాకు వ్యక్తిగత కార్యదర్శిగా, ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవారు. 2019 మార్చి 19న హత్య జరిగినప్పుడు వివేకా ఇంట్లోకి తొలుత వెళ్లి రక్తపు మడుగులో ఉన్న మృతదేహానికి ఫొటోలు, వీడియోలను ఇనయతుల్లానే తీశారు. అతడి మొబైల్ ఫోన్ ద్వారానే ఇతరులకు ఫొటోలు షేర్ చేశారు. ఫొటోలు ఎవరెవరికి పంపారు? ఆ ఫొటోలు తీసినప్పుడు ఎవరెవరు ఉన్నారు? తదితర వివరాలను సీబీఐ ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.
దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై కేసు పెట్టడంతో హైకోర్టులో సీబీఐ పిటిషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివేకా కేసు దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసిన ప్రైవేటు పిటిషన్లు కొట్టేయాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు నిందితుల్ని పిలిస్తే తమపైనే కేసులు దాఖలు చేస్తే ఇక వివేకా కేసులో దర్యాప్తు ముందుకు సాగదని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తేల్చిచెప్పేశారు. నిందితుల వ్యవహారశైలిపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో దిగువ కోర్టుల్లో దాఖలైన ప్రైవేటు పిటిషన్లను కొట్టేయాలని కోరింది. దీనిపై 22వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది.
కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సునీత పిటిషన్
మరో వైపు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు ఆంధ్రప్రదేశ్‌లో అడ్డంకులు సృష్టిస్తున్నందున దానిని హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. సీబీఐ విచారణలో కేసు ముందుకు వెళ్లట్లేదని, ఏపీ ప్రభుత్వం నుంచి పెద్దగా సహాయ సహకారాలు లేవంటూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సునీత తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. సీబీఐ, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో త్వరలో కీలక పరిణామాలుంటాయాా ?
గత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ వివేకా పులివెందులలోని ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌లను నియమించినా నిందుతుల్ని పట్టుకోలేకపోయారు. చివరికి హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం సహకారం పెద్దగా లేకపోవడంతో సీబీఐ అధికారుల దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. హఠాత్తుగా విచారణ ఆపేస్తారు.. మళ్లీ ప్రారంభిస్తారు... ఎప్పటికి దర్యాప్తు పూర్తి చేస్తామో చెప్పలేమని సీబీఐ అధికారులు కోర్టుకు సీబీఐ అధికారులు గతంలో తెలిపారు.
రాజకీయం దూరం కాలేదు - చిరంజీవి బ్లాస్టింగ్ కామెంట్స్ ! అసలు విషయం ఇదేనా ?