CBI Notice To YS Bhaskar Reddy  :   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో   ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన  కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో కానీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ఈ కేసులో ఫిబ్రవరి 23న విచారణకు రావాలంటూ గత నెల 18న నోటీసులు జారీ చేయగా.. కొంత సమయం కావాలంటూ భాస్కర్ రెడ్డి కోరారు.
ముందస్తు కార్యక్రమాలతో బిజీగా ఉన్నందు వల్ల విచారణకు రాలేనని చెప్పారు. దాంతో సీబీఐ విచారణ నిర్వహించలేదు. 


తర్వాత అవినాష్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాతి రోజే తాను సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఆయన కడపకు కూడా వచ్చారు. అయితే సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసూ రాలేదని భాస్కర్‌రెడ్డి తన సన్నిహితులతో చెప్పారు. కాను సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కుకూడా ఫోన్ చేశానని ఆయన స్పందించలేదన్నారు. అప్పుడు విచారణ జరగలేదు. ఇప్పుడు  బీఐ తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు, ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు. ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను కూడా అధికారులు ఇప్పటికే విచారించారు.  వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి  కూడా వరుసగా సీఎం జగన్‌ చిన్నాన్న అవుతారు.    


వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డిని సీబీఐ సూత్రధారిగా భావిస్తోంది. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్‌లో  వైఎస్ వివేకానందరెడ్డిని అడ్డు తొలగించేందుకు, ఎంపీ సీటుకు అడ్డొస్తున్నారని భావించడమే కారణమని సీబీఐ తెలిపింది. వైఎస్ వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో కలిసి అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని వివరించింది. ఆ ప్లాన్‌ను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారని తేలిందన్నారు. ఆ సమయంలో వివేకాను విభేదిస్తున్నవారంతా ఏకతాటిపై తీసుకొచ్చారన్నారు. 


వివేకానందరెడ్డిపై ఆగ్రహంతో ఉన్న ఎర్ర గంగిరెడ్డి..సునీల్ యాదవ్, డ్రైవర్ దస్తగిరి, ఉమా శంకర్ రెడ్డిలను కూడగట్టి ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనేలా చేశారని సీబీఐ వెల్లడించింది. సునీల్ యాదవ్ వజ్రాల పేరుతో విలువైన రాళ్ల వ్యాపారం చేస్తుంటే..వద్దని హెచ్చరించినందుకు వివేకాపై సునీల్ కోపం పెంచుకున్నట్టు సీబీఐ వివరించింది. వివేకానందరెడ్డి హత్య చేసిన రోజు నిందితులంతా వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు సీబీఐ తెలిపింది. ఇటీవలే వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. కాల్ డేటా ఆధారంగా కీలక ప్రశ్నలు సంధించింది. అవినాష్ రెడ్డి ఏ సమయంలో ఎవరెవరికి ఎంతసేపు మాట్లాడారో ఫోన్ నెంబర్లతో సహా సీబీఐ వెల్లడించింది.