YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. జులై 14 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరు పరిచి చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణ సందర్భంగా కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 30వతేదీతో ముగుస్తోంది. గతంలో సుప్రీంకోర్టు జూన్ 30లోగా వివేకా కేసులో పూర్తి వివరాలు బయటపెట్టాలని సీబీఐని ఆదేశించింది.
జూలై 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ
అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అవినాశ్ తండ్రి భాస్కర రెడ్డి ఈ కేసులో జైల్లో ఉన్నారు. అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒక వేళ అరెస్ట్ చేసే పని అయితే .. వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆదేశించింది. ఆ మేరకు సీబీఐ అవినాష్ ని ఓ శనివారం అరెస్ట్ చేసి విడుదల చేశారని తెలుస్తోంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అత్యవసర విచారణ చేయాలని కోరారు. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీం ప్రశ్నించింది. ఈ పిటీషన్ ను జూలై 3న విచారణకు నిర్ణయించింది. -
గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును కోరే యోచనలో సీబీఐ
సీబీఐ విచారణ గడువు పొడిగింపు కోరుతూ సుప్రీంకోర్టును అభ్యర్ధించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 2019 మార్చిలో వివేకా హత్య జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో అనేక మలుపులు చోటు చేసుకేున్నాయి. అవినాశ్ కేంద్రంగా గత కొద్ది నెలలుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో హైకోర్టు విచారణ సమయంలో తమకు ఈ ఘటనతో సంబంధం లేదని..ఇదంతా రాజకీయ కుట్రగా అవినాశం వాదించారు. సీబీఐ మాత్రం అవినాశ్ పైన అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ ముగించటం..సీబీఐ తాజా అభ్యర్ధనతో..సుప్రీం తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
వివేకా కేసులో కీలక మలుపులు
వైఎ్ వివేకానందరెడ్డి కేసులో చాలా రోజులుగా కీలక మలుపులు చేసుకుంటున్నాయి. సీఎం జగన్ పేరును కూడా రెండు సార్లు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో సీబీఐ ప్రస్తావించింది. హత్య జరిగిందని బయట ప్రపంచానికి తెలియక ముందే సీఎం జగన్ కు తెలుసని చెబుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు గడువు పొడిగించాలని సీబీఐ కోరితే.. హత్యలో విస్తృత కుట్ర కోణం గురించి దర్యాప్తు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.