వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాల్సి అవసరం ఉందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సివి నాయుడు పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడుకు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 6 నియోజకవర్గాల్లో ఉన్న తన అనుచరులతో కలసి ఎస్‌సివి నాయుడు పార్టీలో చేరారు.


రాష్ట్రం గెలవాలన్న చంద్రబాబు..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాల్సి అవసరం ఏర్పడిందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. వ్యక్తులు, పార్టీలు శాశ్వతం కాదని, రాష్ట్రం శాశ్వతం అనే విషయాన్ని గుర్తించి ప్రజలను అలర్ట్ చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు చంద్రబాబు.  జగన్ లాంటి సైకో పోవాలన్నారు.  కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పగలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.  తాను హైదరాబాద్ అభివృద్ది చేసింది తెలుగు జాతి కోసమని,  అయితే ఇప్పుడు ఏపీలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకే కాదు,  వైసీపీ నేతలకు కూడా కంటి మీద కునుకులేదని అభిప్రాయపడ్డారు.


విద్యా రంగం దైన్యంగా మారింది..
జగన్ ఎంత పక్కాగా అబద్దాలు చెపుతారో విద్యారంగాన్ని చూస్తే తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని, రాష్ట్రం నుంచి 90 వేల మంది ఎంసెట్ రాయడానికి తెలంగాణ వెళ్లారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాసంస్థలు తెచ్చింది తెలుగుదేశమేనని అన్నారు. మళ్లీ అటువంటి సంస్థలు ఏపీలో ఉండాలని 2014తరువాత ఐఐటి, ఐఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్‌ఐటి, ట్రైబల్ యూనివర్సిటీ తెచ్చామని చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతం కావాలి అని ఎస్‌ఆర్ఎం, విట్, ఎక్స్ ఎల్ ఆర్ ఐ వంటి సంస్థలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ విట్ కాలేజ్‌కు వెళ్లడానికి కనీసం దారి కూడా వెయ్యలేదన్నారు. 


తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.364 కోట్లు ఖర్చు చేసి 5 వేల మందిని విదేశీ విద్యకు పంపామని, ఇప్పుడు జాబ్ క్యాలండర్ లేదన్నారు చంద్రబాబు. ఉద్యోగాలు లేవన్నారు. ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు, ట్రస్ట్ కాలేజ్‌లు అన్నీ నాశనం చేశారని మండిపడ్డారు. తెలుగులో చదివిన సత్య నాదెళ్ల, తమిళంలో చదివిన సుందర్ పిచాయ్ ఉన్నత స్థానానికి వెళ్లారని గుర్తు చేశారు. 


భూములను సైతం వదలటం లేదు...
విశాఖలో లలితేష్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకుని రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు వైజాగ్‌లో భూమి కొనుక్కున్నారని, జగన్ సిఎం అయిన తరువాత ఆ భూమి లాక్కోవాలని చూశారని ఆరోపించారు. అతను అడ్డుపడితే దానిపై లిటిగేషన్‌లు పెట్టారని, కోర్టుకు వెళ్లి తన సొంత భూమిని కాపాడుకోవడానికి కష్ట పడ్డాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అంతేకాదు కుదరవల్లి శ్రీనివాసరావు ట్రస్ట్ భూములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారని, ఈ దుర్మార్గులు ఆ భూమి కోసం శ్రీనివాసరావు పిల్లలను కిడ్నాప్ చేశారని అన్నారు. తెలంగాణ పోలీసుల ద్వారా వారు భయటపడ్డారని అన్నారు. చివరకు ఆయన అమెరికా వెళ్లిపోయారని, అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారని , ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు.