వివేకాహత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. 12 రోజుల పాటు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు బెయిల్ కు సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ కు అనుమతించింది. అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డి బెయిల్ కోరగా, కోర్టు అందుకు అనుమతించింది.
ఏప్రిల్ 16న అరెస్టు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఏప్రిల్ 16న అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి ఏప్రిల్ 16 తెల్లవారుజామునే రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు 10 మందికి పైగా వెళ్లి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అప్పుడు అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు అయింది. 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాధారాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిందని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధారాలు గురించినట్లుగా సీబీఐ అధికారులు అప్పట్లో తెలిపారు.
బెయిల్ కోసం పిటిషన్లు
జూన్ నెలలో భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు అన్నారు.
బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను జూన్ నెలలో సీబీఐ కోర్టు కొట్టి వేసింది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావిత వ్యక్తి అని, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐతో పాటు వివేకా కుమార్తె సునీత చేసిన వాదనలను సీబీఐ కోర్టు జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు.
ఈ నెలలోనూ బెయిల్ తిరస్కరణ
ఈ సెప్టెంబరు 4న కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు కొద్ది రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది.