అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యే విషయంపై మినహాయింపు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం జరిగిన విచారణలో సీబీఐ తన వాదన వినిపించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంగానే గతంలో హైకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పుడు జగన్ హోదా పెరిగినందున మరితంగా సాక్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. పదేళ్లుగా అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు వేస్తున్నారని.. సీబీఐ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికి క్వాష్ పిటిషన్ల దగ్గరే పలు కేసులు ఉన్నాయన్నారు. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యమవుతుందని సీబీఐ వాదించింది.
గత వారం జరిగిన విచారణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు తమ వాదన వినిపించారు. సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ కోసం 5 రోజులు కోర్టుకు హాజరు కాలేనని.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయని తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రి కావడం వల్ల పాలనా పనులతో పాటు ప్రొటోకాల్ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నారు. సీఎం హోదాలో ఉన్న ఆయన్ను కలవడానికి కోర్టుకు జనం ఎక్కువగా వస్తారని.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి వారం హాజరయ్యారని.. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారని గుర్తు లాయర్ గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు హాజరు మినహాయింపు కావాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. అక్కడ కూడా తాము ముఖ్యమంత్రి అయినందున అధికార విధుల నిర్వహణ నిర్వహణ కోసం మినహాయింపు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే చట్టం అందరికీ ఒకటే అని చెప్పి సీబీఐ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పట్లో ప్రతి శుక్రవారం విచారణ జరిగేది. కానీ ప్రజాప్రతినిధులపై కేసులను రోజువారీ విచారణ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో రోజువారీ విచారణ జరుగుతోంది. ప్రస్తుతం వివిధ కారణాలతో జగన్ హాజరు మినహాయింపు కోరుతున్నారు.
Also Read : వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పోలవరం పూర్తి కాదు .. రాజ్యసభలో తేల్చి చెప్పిన కేంద్రం !
వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించే సమయంలోనూ మినహాయింపు కోసం ప్రయత్నించారు. కానీ కోర్టులో అనుకూల తీర్పు రాలేదు. దీంతో గురువారం సాయంత్రం పాదయాత్ర నిలిపివేసి మళ్లీ శనివారం ప్రారంభించేవారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి