ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై నెల్లూరు జిల్లాలో క్రిమినల్ కేసు నమోదైంది. జూన్‌ 5న నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రో ఫార్మస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మట్టి అవసరమని ఎం.శ్రీనివాసులురెడ్డి పేరుతో 3వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకున్నారు. అయితే జర్వాయర్‌లో అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు రిజర్వాయర్‌లో కొలతలు వేసి అనుమతులకు మించి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. 8వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తే.. 18,629 క్యూబిక్‌ మీటర్లు తవ్వినట్లు తేల్చారు. అయితే అక్కడ ఒక్క ఎం. శ్రీనివాసులు రెడ్డి మాత్రమే కాదు ఉదయ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి అనే మరో ఇద్దరు వ్యక్తులకు కూడా అనుమతులు ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురిపైనా క్రిమినల్ కేసులు పెట్టారు.  


ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ-1గా, ఎం. శ్రీనివాసులరెడ్డిని ఏ-2గా, శ్రీధర్ రెడ్డిని ఏ-3గా పేర్కొన్నారు. జూన్‌ 21న ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు కానీ ఇంతవరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. కేసులు నమోదు చేసినట్లుగా ఎంపీకి కూడా సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ కేసు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడీ వ్యవహారం జిల్లాలో సంచలనం అవుతోంది. మాగుంట కుటుంబం మట్టి తవ్వకాల కోసం దరఖాస్తు పెట్టిందా అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది. ఆయన సంతకం ఫోర్జరీ చేశారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కేసు అంశంపై ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంత వరకూ స్పందించలేదు. ఇటీవలి కాలంలో ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరాటం ఎక్కువయింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట మధ్య సరిపడని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల కిందట కొవిడ్ కేర్ సెంటర్‌ను ఎంపీ మాగుంట సొంత నిధులతో ఏర్పాటు చేశారు. దానికి ఆయన పేరునే పెట్టుకున్నారు. కానీ రాత్రికి రాత్రి ఆయన నిధులను ఆయనకు వెనక్కి ఇచ్చేసిన కలెక్టర్.. మంత్రి బాలినేని పేరు పెట్టి కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారు. దీనిపై అప్పట్లో వివాదం రేగింది. తర్వాత సద్దుమణిగింది. 


ఎంపీ అయినప్పటికీ.. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో మాగుంట ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉంటోంది. ఆయన ఒంగోలు నుంచి ఎంపీగా ఉంటున్నప్పటికీ.. నెల్లూరు జిల్లా కూడా వారి సొంత జిల్లాలాంటిదే. అందుకే అక్కడా ఆయన రాజకీయాలు చేస్తూ ఉంటారు. రెండు జిల్లాల్లోనూ ఆయనకు అనుచర వర్గం ఎక్కువగానే ఉంది. అయితే ఆయన ఎంపీగా ఒంగోలు నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగు జిల్లాలో కేసు నమోదవడం వైసీపీ వర్గాల్లోనే సంచలనంగా మారింది. పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని ఇటీవల మాగుంటపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేసు విషయం బయటకు రావడం.. మరింత సంచలనాత్మకం అవుతోంది. ఆయన స్పందనను బట్టి తదుపరి రాజకీయం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.