TDP And Janasena: ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. 10 స్థానాలకు అభ్యర్థులను టీడీపీ, జనసేన ఫిక్స్ చేశాయి.  మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పామర్రు నియోజకవర్గం నుంచి వర్ల కుమార్ రాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ తూర్పు ( Vijayawada East) సెగ్మెంట్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథిలను అభ్యర్థులుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా.. సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు మరోసారి బరిలోకి దిగనున్నారు. ఇక జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముండగా.. ఏప్రిల్‌లో ఎన్నికల పోలింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ఈసీ ఫిక్స్ చేసిందని, అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఏప్రిల్ 16న ఏపీ ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చుతూ పరోక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. దీంతో టీడీపీ కూడా అభ్యర్థుల ఖరారుపై స్పీడ్ పెంచింది. ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థులు ఎవరనే దానిపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని సీట్లలో మినహా దాదాపు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ, జనసేన కూటమి ఖరారు చేసింది.


ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 17 స్థానాలు ఉండగా.. 12 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేశారు. తెనాలి సీటును జనసేనకు కేటాయించగా.. అక్కడ నుంచి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు, పొన్నూరు నుంచి దూళిపాళ్ల నరేంద్ర కుమార్, చిలకలూరిపేట నుంచి పత్తిపాటి పుల్లారావు పేర్లు ఖరారయ్యాయి. అటు పత్తిపాడు నుంచి బూర్ల రామాంజనేయులు, వినుకొండ నుంచి జీవీ  ఆంజనేయులు, మాచర్ల నుంచి జులకంటి బ్రహ్మరెడ్డి, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు, బాపట్ల నుంచి వేగేశ్న నరేంద్ర శర్మ అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాయి. సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ పేర్లు ఖరారయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంపీ స్థానాలకు కూడా టీడీపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. నర్సరావుపేట ఎంపీ సీటును లావు శ్రీ కృష్ణదేవరాయలు, గుంటూరు నుంచి పేమ్మసాని చంద్రశేఖర్లకు టికెట్ కేటాయించారు.


దాదాపు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై టీడీపీ, జనసేన క్లారిటీకి వచ్చాయి. కానీ అనూహ్యంగా బీజేపీ కూడా పొత్తులో  చేరేందుకు రెడీ అయింది. దీంతో  3 ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి ఇవ్వాలని టీడీపీ, జనసేన ఓ అంచనాకు వచ్చాయి. మరో వారం రోజుల్లో బీజేపీతో పొత్తుపై పూర్తి స్పష్టత రానుంది.