AP BJP Politics : దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలాన్ని ఓట్లశాతం ప్రకారం చూస్తే.. అత్యంత లీస్ట్ లో ఉండేది ఆంధ్రప్రదేశ్. బీజేపీకి ఒకటి కన్నా తక్కువ శాతం ఓటింగ్ నమోదయింది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకప్పుడు బీజేపీకి ఒక్క సీటే ఉండేది. ఇప్పుడు గుజరాత్ లో తిరుగులేని స్థానంలో ఉంది. కర్ణాటకలో నిన్నటి వరకూ అధికారంలో ఉంది. కానీ ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతోంది. బీజేపీ ఒకప్పుడు దేశవ్యాప్తంగా రెండే లోక్‌సభ సీట్లతో ప్రయాణం ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ బలపడుతోంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా పరిస్థితి మారింది.
ఉమ్మడి ఏపీలో బీజేపీకి పది శాతానికిపై ఓట్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు ఉన్నా లేకపోయినా బీజేపీకి పది శాతం వరకూ ఓట్లు ఉండేవి. పొత్తులు లేకపోయినా అప్పట్లోనే వెంకయ్యనాయుడు ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరికొందరు బీజేపీ నేతలు గట్టి పోటీ ఇస్తూండేవారు. పొత్తులు లేనప్పుడు కూడా ఉభయగోదావరి జిల్లాలో బీజేపీకి పద్దెనిమిది శాతం వరకూ ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత బీజేపీ పరిస్థితి దిగజారడం ప్రారంభమయింది. చివరికి రాష్ట్ర విభజన తర్వాత తేరుకోలకేపోయారు. కానీ తెలంగాణలో మాత్రం మెరుగుపడ్డారు. ఒంటరిగా పోటీ చేసి అధికారం సాధించుకుంటామన్నంత బలమైన స్థానానికి వచ్చారు. కానీ ఏపీలో మాత్రం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ తెచ్చుకునే బలం లేదు. సొంత బలంతో డిపాజిట్ తెచ్చుకునే నేతలు కూడా లేరు.
ఢిల్లీ రాజకీయాల కోసం ఏపీ బీజేపీ త్యాగం !
అయితే ఏపీ బీజేపీ ఎదగలేకపోవడానికి రాష్ట్ర నాయకులే కారణం కాదు.. కేంద్ర నాయకత్వం కూడా కారణం. ఢిల్లీలో ksxodjx ప్రభుత్వ అవసరాల కోసం.. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో పరోక్షంగా అయినా సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొన్ని సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం.. కొన్ని సార్లు వైఎస్ఆర్‌సీపీ లాంటి పార్టీలతో అంతర్గత అవగాహనతో పోరాటాలు చేయకుండా ఉండటంతో సమస్య జఠిలమవుతోంది. ఏపీ బీజేపీలో బలమైన ప్రజానేతలు పెద్దగా లేరు. ఉన్న వారంతా పార్టీ మీద ఆధారపడేవారే. అందుకే విజయం బీజేపీ దగ్గరకు చేరడంలేదు. బీజేపీ మోదీ, షాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో బలహీనంగా ఉన్న చోట్ల బలోపేతం చేసుకున్నారు. కానీ ఏపీలో అది కూడా సాధ్యం కాలేదు. పాతుకుపోయిన నేతలు జనాల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయలేకపోయారు. ఫలితంగా బీజేపీ ముందడుగు వేయలేకపోతోంది.
బీజేపీని ఎదగకుండా సత్సంబంధాలు పాటిస్తున్న ప్రాంతీయ పార్టీలు
ఏపీలో బీజేపీ దుస్థితికి ప్రాంతీయ పార్టీల వ్యూహం కూడా కారణమే. రెండు పార్టీలు బీజేపీతో ఢిల్లీ స్థాయిలో స్నేహంగా ఉంటాయి. నిజానికి ఏపీ బీజేపీ నేతలు కొంత కాలంగా పోరాడుతున్నారు. ఏపీ బీజేపీ పోరాడుతున్నా.. అంతా లైట్ తీసుకోవడానికి కారణం... ఏపీలోని కొంత మంది నేతల తీరు మాత్రమే కాదు.. కేంద్రం కూడా ప్రధాన కారణమే. ప్రధాని మోదీ స్వయంగా ఇలా చార్జ్ తీసుకోవాలని తమ పార్టీ నేతలకు చెప్పారు కానీ.. తాను పల్లెత్తు మాట అనలేదు. ఇక బీజేపీకి వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకమని ప్రజలు ఎలా అనుకుంటారు. అందుకే కేంద్ర బీజేపీనే తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎలా శత్రువుగా ప్రకటించారో అలా ప్రకటించి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే..అప్పుడు రాష్ట్ర నేతలు.. ఏదో విధంగా అందుకుంటారు. టీడీపీ విషయంలోనూ అంతే. మోదీ విధానాలకు తాము అనుకూలని చంద్రబాబు ప్రకటించారు. అంటే రెండు పార్టీలూ బీజేపీకి అనుకూలమే. ఇలాంటి పరిస్థితి వల్లే బీజేపీ ఎదగలేకపోతోంది. ఇందులో కేంద్ర పార్టీదే ఎక్కువ కారణం అనుకోవచ్చు.