New districts in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28కి చేరాయి. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా జనవరి ఒకటి నుంచి ఉనికిలోకి రానున్నాయి. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లుగా మంత్రులు ప్రకటించారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాంతీయ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని మార్కాపురం, పోలవరంలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ నివేదికకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం మార్కాపురం జిల్లా. భౌగోళికంగా చాలా దూరంగా ఉన్న కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లడం ఇక్కడి ప్రజలకు పెద్ద భారంగా ఉండేది. మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఈ జిల్లాలో ఉంటాయి. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 11.42 లక్షలతో ఈ జిల్లా ఏర్పడుతుంది.
మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా..
రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రంను మదనపల్లెకు మార్చారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌పై మంత్రివర్గంలో తీవ్ర చర్చ జరిగింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్వేగానికి లోనైనప్పటికీ, భౌగోళిక , పరిపాలనా కారణాల దృష్ట్యా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఖరారు చేశారు. మదనపల్లె ,కొత్తగా ఏర్పడిన పీలేరు రెవెన్యూ డివిజన్లు కలిపి జిల్లాగా ఉంటాయి. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో ఈ జిల్లా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం , జెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా జిల్లా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు తాత్కాలిక భవనాలను గుర్తించి, శాశ్వత కలెక్టరేట్లకు నిధులు కేటాయించనున్నారు.
గతంలో జిల్లాల విభజన సమయంలో తప్పులు చేశారని దాని వల్లనే ప్రస్తుతం సమస్యలు వస్తున్నాయన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చే విషయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసంతృప్తికి గురైన మాట వాస్తవమేనని మంత్రులు మీడియా సమావేశంలో చెప్పారు. అయితే పరిపాలనా నిర్ణయాలలో భాగంగా తప్పలేదన్నారు. రాయచోటి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.